తెలంగాణ

telangana

ETV Bharat / international

పోలీసుల చేతిలో మరో నల్లజాతీయుడు మృతి - అమెరికా

అమెరికాలోని అట్లాంటాలో మరో నల్లజాతీయుడు పోలీసుల కాల్పులకు బలయ్యాడు. ఓ రెస్టారెంట్​లో కస్టమర్లకు ఇబ్బంది కలిగిస్తున్నాడన్న ఆరోపణలతో బ్రూక్స్​ అనే 27ఏళ్ల వ్యక్తిని అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించారు పోలీసులు. అతడు సహకరించకపోవడం వల్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చివరికి అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.

Atlanta police killed black man after struggle, police chief resigned
పోలీసుల చేతిలో మరో నల్లజాతీయుడు మృతి

By

Published : Jun 14, 2020, 10:44 AM IST

ఆఫ్రో-అమెరికన్​ జార్జ్​ ఫ్లాయిడ్​ మృతి ఉదంతాన్ని ప్రపంచం మరువకముందే.. అమెరికాలో పోలీసుల చేతిలో మరో నల్లజాతీయుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. అట్లాంటాలోని రెస్టారెంట్​లో ఓ నల్లజాతీయుడిని అదుపులోకి తీసుకునే క్రమంలో అతడిపై పోలీసులు కాల్పులు జరిపారు. చివరికి అతడు మృతి చెందాడు.

టేజర్​ ప్రయోగించినా...

శుక్రవారం రాత్రి అట్లాంటాలోని రెస్టారెంట్​లో.. ఓ వాహనం కస్టమర్లకు ఇబ్బంది కలిగిస్తోందన్న ఫిర్యాదుతో ఘటనాస్థలానికి వెళ్లారు పోలీసులు. అనంతరం వాహనంలో ఉన్న 27ఏళ్ల రేయ్​షార్డ్​ బ్రూక్స్​ మద్యం సేవించి ఉన్నాడన్న అనుమానంతో అతడికి పరీక్ష చేశారు. అతడు మద్యం తాగినట్లు తేలగా.. పోలీసులు అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించారు. కానీ బ్రూక్స్​ అక్కడి నుంచి తప్పుకుందామని చూశాడు. ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

చివరికి ఆ నల్లజాతీయుడిపై పోలీసులు టేజర్​ను ప్రయోగించారు. అయినా ఫలితం దక్కలేదు. అదే సమయానికి అతడు పోలీసు వద్ద నుంచి టేజర్​ లాక్కొని బెదిరించాడని జార్జియా దర్యాప్తు సంస్థ(జేబీఐ) పేర్కొంది. టేజర్​ను తిరిగి పొందే క్రమంలో పోలీసులు బ్రూక్స్​పై కాల్పులు జరిపినట్టు ఓ ప్రకటనను విడుదల చేసింది. ఆ నల్లజాతీయుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా ప్రాణాలు కోల్పోయాడని వివరించింది. ఈ పూర్తి వ్యవహారంలో ఓ పోలీసు అధికారి గాయపడినట్టు వెల్లడించింది.

అట్లాంటా పోలీసు విభాగం అభ్యర్థన మేరకు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నట్టు జేబీఐ స్పష్టం చేసింది. ప్రస్తుతం ఘటనకు సంబంధించిన వీడియోను పరిశీలిస్తున్నట్టు వివరించింది. ప్రత్యక్ష సాక్ష్యులు ఎవరైనా ఉంటే.. ముందుకు రావాలని ట్వీట్​ చేసింది.

పోలీస్​ చీఫ్​ రాజీనామా...

బ్రూక్స్​ మరణంతో అట్లాంటాలో నిరసనలు భగ్గుమన్నాయి. ఘటనాస్థలంలో స్థానికులు ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో అట్లాంటా పోలీసు విభాగం అధిపతి ఎరికా షీల్డ్స్​ తన పదవికి రాజీనామా చేశారు.

నల్లజాతీయుడు జార్జ్​ ఫ్లాయిడ్​ మరణం వల్ల చెలరేగిన నిరసనలతో అట్లాంటా అట్టుడికింది. ఇప్పుడిప్పుడే పరిస్థితులు కుదుటపడుతున్న సమయంలో మరో నల్లజాతీయుడి మృతి వార్త తీవ్ర కలకలం రేపుతోంది.

ఇదీ చూడండి:-ఐరోపాలో 'ఫ్లాయిడ్' నిరసనల సెగ

ABOUT THE AUTHOR

...view details