ఆఫ్రికాలోని సాహెల్, లేక్ ఛాద్ ప్రాంతాల్లో ఉగ్రవాదం పెచ్చుమీరడం సహా గల్ఫ్ ఆఫ్ గయానా సముద్ర నేరా(పైరసీ)లకు కేంద్రబిందువుగా మారడంపై ఐరాస వేదికగా భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వ్యవస్థీకృత నేరాలు నిరంతరం కొనసాగుతున్నాయని పేర్కొంది. మాలీ, నైజర్, బుర్కినా ఫాసోలో ఉగ్ర దాడులు పెరిగిపోతున్నాయని ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి టీఎస్ తిరుమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఉగ్రవాదం ఇతర ప్రాంతాలకు వ్యాపిస్తోందని అన్నారు. పలువురు భారతీయులు సైతం ఈ సమస్యల వలలో చిక్కుకున్న నేపథ్యంలో.. ఉగ్రవాదం, పైరసీపై సమర్థవంతంగా పోరాటం సాగించాలని పిలుపునిచ్చారు.
ఐరాస భద్రత మండలిలో ప్రసంగించిన ఆయన.. ఈ ప్రాంతంలో ఉగ్రసంస్థల ఎదుగుదలకు కళ్లెం వేయడానికి సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని నొక్కిచెప్పారు. దీనికి ఐరాస పశ్చిమ ఆఫ్రికా, సాహెల్ కార్యాలయం(యూఎన్ఓడబ్ల్యూఏఎస్) సహా అనుబంధ సంస్థలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు.
పైరసీకి హాట్‌స్పాట్
గల్ఫ్ ఆఫ్ గయానా ప్రాంతం సముద్ర దొంగతనా(పైరసీ)లకు హాట్‌స్పాట్‌గా మారిందని అన్నారు తిరుమూర్తి. పైరసీకి సంబంధించి గడిచిన ఆరు నెలల్లో 17 ఘటనలు ఈ ప్రాంతంలోనే వెలుగుచూశాయని గుర్తు చేశారు. పలువురు భారత నావికులు సైతం అపహరణకు గురయ్యారని తెలిపారు. సముద్రంలో భద్రతను పెంచి, అంతర్జాతీయ సహకారంతో నిఘాను పటిష్ఠం చేయాల్సిన ఆవశ్యకత ఉందని స్పష్టం చేశారు.
"ఉగ్రవాదం, పైరసీ సమస్యలపై సమర్థవంతంగా, నిర్ణయాత్మకంగా వ్యవహరించాలి. అంతర్జాతీయ సమాజం సైతం సమన్వయంతో కూడిన విధానాన్ని అవలంబించాలి. సాహెల్‌లో దయనీయ పరిస్థితులు ఉన్న నేపథ్యంలో.. పొందికైన వ్యూహాన్ని పాటించాలి."