ఉద్గారాలను తగ్గించటంలో అమెరికా సహా ఇతర పెద్ద ఆర్థిక వ్యవస్థలు కృషి చేయాల్సిన అవసరం ఉందని అధ్యక్షుడు జో బైడెన్ వ్యాఖ్యానించారు. వాతావరణ మార్పులపై ప్రపంచ దేశాల సదస్సును ఆయన వర్చువల్గా ప్రారంభించారు. వాతావరణ మార్పులకు కారకాలైన కర్బన, పెట్రోలియం ఉత్పత్తుల వాడకాన్ని తాము సగం మేర తగ్గిస్తామని బైడెన్ పేర్కొన్నారు.
"ఈ సమావేశం మనం ఈ భూగ్రహాన్ని కాపాడడానికి మాత్రమే కాదు. మనందరి కోసం ఉత్తమ భవిష్యత్తును నిర్మించడానికి కూడా. ఇది ప్రమాదకరమైన క్షణమే.. అయినా అవకాశాలను అందించే క్షణం కూడా. "
-జో బైడెన్, అమెరికా అధ్యక్షుడు
2030 నాటికి శిలాజ ఇంధనాల ఉద్గారాలను తాము 52 శాతం మేర తగ్గిస్తామని బైడెన్ ఈ సదస్సులో ప్రకటించారు. ఈ సదస్సు ప్రారంభం కంటే ముందు జపాన్ కూడా తమ కర్బన ఉద్గారాలను 46 శాతం మేర కట్టడి చేస్తామని ప్రకటించింది.
'ఆ దేశాలకు సాయం చేయాలి'
2030 కంటే ముందు నాటికి తమ కర్బన ఉద్గారాలను అత్యంత అధిక స్థాయికి తీసుకువెళ్తామని, 2060 కంటే ముందునాటికి వాటిని తటస్థం చేస్తామని చైనా పునరుద్ఘాటించింది. ఈ మేరకు అమెరికా ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో చైనా అధ్యక్షుడు జిన్పింగ్ పేర్కొన్నారు.
అభివృద్ధి చెందిన దేశాలు కర్బన ఉద్గారాలకు అధిక బాధ్యత వహిస్తాయని జిన్పింగ్ పేర్కొన్నారు. ఆ దేశాలు తమ దేశంలో మార్పులు చేయటం సహా అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఉద్గారాలను తగ్గించటంలో సాయం చేయాలని కోరారు.