అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. టెక్సాస్ రాష్ట్రంలోని ఒడెస్సా పట్టణ సమీపంలోని మిడ్లాండ్ ప్రాంతంలో ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. మరో 21 మంది గాయపడ్డారు. వీరిలో ముగ్గురు అధికారులు ఉన్నారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దుండగుడిని మట్టుబెట్టారు. ప్రస్తుతానికి సాయుధులైన ముష్కరులు ఎవరూ మిడ్లాండ్లో లేరని తెలిపారు.
టొయోటా వాహనంలో వచ్చిన దుండగుడు తొలుత యూఎస్ పోస్టల్ సర్వీస్ వ్యాన్ని దొంగిలించాడు. అనంతరం అదే వ్యాన్లో ఘటనా స్థలానికి చేరుకున్నాడు. స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 3 గంటల సమయంలో పౌరులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. మొదటగా ఇద్దరు దుండగులు ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు పోలీసులు అనుమానించారు. అయితే ఒక వ్యక్తి ఫైరింగ్ జరిపినట్లు ప్రాథమికంగా నిర్ధరించారు.