కరోనా మహమ్మారి కట్టడికి.. ఆస్ట్రాజెనెకా తయారుచేస్తున్న వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ అమెరికాలో మూడో దశకు చేరుకున్నాయని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. జరగవు అనుకున్న పనులను అమెరికాలో చేసి చూపిస్తున్నామని ట్రంప్ అన్నారు. ఈ వ్యాక్సిన్ తుది అనుమతులకు సిద్ధమైందని చెప్పారు.
ఈ ప్రక్రియ పూర్తి కావడానికి సాధారణంగా ఏళ్ల తరబడి సమయం పడుతుందని కానీ, తన ప్రభుత్వం నెలల్లోనే పూర్తిచేసిందని చెప్పుకొచ్చారు.
30 వేల మందిపై పరిశోధన
ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంతో కలిసి ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా తయారు చేస్తున్న ఈ వ్యాక్సిన్‌ను... 30 వేల మందిపై పరీక్షించనున్నామని పరిశోధకులు చెబుతున్నారు. అమెరికా వ్యాప్తంగా వివిధ జాతులకు చెందిన ప్రజలను వాలంటీర్లుగా తీసుకుంటున్నామని తెలిపారు. వీరిలో ఆరోగ్యంగా ఉన్న వారితో సహా హెచ్ఐవీ, ఇతర రోగాలున్న వారు కూడా ఉన్నారన్నారు.
2021 జనవరి నాటికి 30 కోట్ల డోసుల వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేయడానికి.. అమెరికాలో మూడో దశ క్లినికల్ పరీక్షలు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయి. ఆస్ట్రాజెనెకాతో సహా మోడెర్నా, పైజర్ సంస్థలు కూడా మూడో దశ క్లినికల్ పరీక్షలు చేస్తున్నాయి.
ఇదీ చూడండి:కొవిడ్ నిబంధనలతో అక్కడ పాఠశాలల పునఃప్రారంభం