కరోనా మహమ్మారి వ్యాక్సిన్ కోసం యావత్ ప్రపంచ ఎదురుచూస్తోంది. ఇప్పటికే పలు సంస్థలు మూడో దశ ట్రయల్స్‌కు చేరుకున్న నేపథ్యంలో టీకాపై ఆశలు రేకెత్తాయి. అయితే.. ఈ ప్రయోగాల్లో ముందంజలో ఉన్న ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనికా రూపొందిస్తున్న వ్యాక్సిన్ క్యాండిడేట్ మూడోదశ క్లినికల్ ట్రయల్స్ నిలిచిపోయాయి. ట్రయల్స్‌లో భాగంగా టీకా తీసుకున్న ఓ వ్యక్తికి అనారోగ్య సమస్యలు తలెత్తిన నేపథ్యంలో ఈ మేరకు ట్రయల్స్ నిలిపివేస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. కానీ, దానికి సంబంధించిన ఎలాంటి విషయాన్ని వెల్లడించలేదు.
బ్రిటన్‌లో చేపట్టిన మూడోదశ ప్రయోగాల్లో ఓ వ్యక్తికి టీకా దుష్ప్రభావాలు కనిపించిన నేపథ్యంలో ట్రయల్స్ నిలిచిపోయినట్లు తొలుత.. ఎస్టీఏటీ వార్తా సంస్థ నివేదించింది. అనంతరం అమెరికా సహా ఇతర దేశాల్లో వ్యాక్సిన్ ట్రయల్స్ నిలిపివేసినట్లు ఆస్ట్రాజెనికా సంస్థ ప్రతినిధి ప్రకటించారు.
''వ్యాక్సిన్ ట్రయల్స్ నిలిపివేత అన్నది సహజంగా జరిగే ప్రక్రియే. ప్రయోగదశలో ఎవరికైనా తేడా వస్తే ఇలా చేస్తాం. దీనిపై దర్యాప్తు జరుగుతోంది. ట్రయల్స్‌పై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం. వ్యాక్సిన్ తయారీ ఆలస్యం కాకుండా ఉండేలా.. ఇలా ఎందుకు జరిగిందో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నాం.''
- ఆస్ట్రాజెనికా
వ్యాక్సిన్ మూడో దశ ప్రయోగాల కోసం అమెరికాలో 30వేల మందిని నియమించే ప్రక్రియను ఆగస్టులోనే ప్రారంభించింది ఆస్ట్రాజెనికా. అలాగే బ్రిటన్‌లోనూ వేల మందిపై ట్రయల్స్ చేస్తోంది. బ్రెజిల్, దక్షిణాఫ్రికాలోనూ ఈ ప్రయోగాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.