ప్రపంచ ఆరోగ్య సంస్థ 'గ్లోబల్ టీబీ నివేదిక' ప్రకారం... భారతదేశంలో గతేడాది 5.4 లక్షల క్షయ వ్యాధి కేసులు నమోదుకాలేదు. 2017తో పోల్చితే మాత్రం 2018లో భారత్లో క్షయ రోగుల సంఖ్య 50 వేల వరకు తగ్గిందని నివేదిక స్పష్టం చేసింది. ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో క్షయ రోగులున్న 8 దేశాల్లో భారత్ ఒకటిగా ఉంది.
ఫలితం కనబడుతోంది..
భారత్లో 2017లో 27.4 లక్షల క్షయ రోగులు ఉండగా, 2018కి ఈ సంఖ్య 26.9 లక్షలకు దిగొచ్చింది. అలాగే ప్రతి లక్ష మంది జనాభాకు 2017లో 204 మంది క్షయ రోగులుండగా 2018కి ఈ సంఖ్య 199కి తగ్గింది.
"ప్రపంచవ్యాప్తంగా 3 మిలియన్ల క్షయవ్యాధి కేసులు నమోదుకాలేదు. భారత్లో 2018లో 2.69 మిలియన్లలో కేవలం 2.15 మిలియన్ల కేసులు మాత్రమే నమోదయ్యాయి. 5,40,000 మంది రోగుల వివరాలు నమోదుకాలేదు."
-ప్రపంచ ఆరోగ్య సంస్థ టీబీ నివేదిక
రిఫాంపిసిన్ పనిచేస్తోంది..
ట్యూబర్ క్యూలోసిస్ నివారణకు రిఫాంపిసిన్ ఔషధాన్ని 2017లో 32 శాతం రోగులకు అందించగా, 2018లో 46 శాతం మందికి అందించారు. ఫలితంగా ఈ చికిత్స విజయవంతమైన రేటు 2017లో 69 శాతం నుంచి 2018కి 81 శాతానికి పెరిగింది.
మునుపెన్నడూ లేనంతగా
నూతన చికిత్స విధానం వల్ల 2018లో ప్రపంచవ్యాప్తంగా మునుపెన్నడూ లేనివిధంగా క్షయ వ్యాధిగ్రస్థుల మరణాలు బాగా తగ్గాయి. 2017లో 1.6 మిలియన్ల మంది మరణించగా, 2018లో ఈ సంఖ్య 1.5 మిలియన్లకు తగ్గింది. అయితే తక్కువ ఆదాయ వర్గాలు, అట్టడుగు ప్రజల్లో ఈ వ్యాధి ఎక్కువగా ఉందని గ్లోబల్ టీబీ నివేదిక స్పష్టం చేస్తోంది. 2018లో 10 మిలియన్ల జనాభా క్షయ వ్యాధి బారినపడ్డారని పేర్కొంది.
ముగ్గురిలో ఒక్కరికే చికిత్స
ఔషధాల కొరత వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రతి ముగ్గురిలో ఒక్కరికి మాత్రమే క్షయ వ్యాధి చికిత్స అందుతోందని డబ్ల్యూహెచ్ఓ నివేదిక వెల్లడించింది. వెనుకబడిన దేశాల్లోని 80 శాతం రోగులు తమ ఆదాయంలో 20 శాతాన్ని వైద్య ఖర్చులకే కేటాయించాల్సి వస్తోందని పేర్కొంది.
డబ్ల్యూహెచ్ఓ నూతన మార్గదర్శకాలు
2019 మార్చి 24న విడుదల చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ నూతన మార్గదర్శకాల ప్రకారం క్షయ వ్యాధి నివారణకు బహుళ రోగ నిరోధక చికిత్స విధానాలను అమలుచేయాలని నిర్ణయించారు. నోటి ద్వారా తీసుకునే ఔషధాలను సమకూర్చాలని తీర్మానించారు. ఫలితంగా ఈ వ్యాధి నివారణ చర్యలను ప్రపంచ దేశాలు వేగవంతం చేయడానికి వీలవుతుంది. అయితే రోగుల సంఖ్యను నమోదు చేసే విషయంలో చాలా లోపాలు ఉంటున్నాయని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది.
ఇదీ చూడండి: ఏం ఐడియా గురూ.. పరీక్షలో తలతిప్పే ఛాన్సే లేదు!