తెలంగాణ

telangana

ETV Bharat / international

చంద్రయాన్​: తొలి అడుగుకు అర్ధ శతాబ్దం

'అంతరిక్షం' ఓ అంతుచిక్కని రహస్యం. ఆ రహస్యం తెలుసుకునేందుకు ఎన్నో యత్నాలు. దశాబ్దాలుగా సాగుతున్న ఆ ప్రయత్నాల్లో అత్యంత కీలకమైంది... నాసా 'అపోలో 11' మిషన్​. తొలిసారి మనిషి చంద్రుడిపై కాలుమోపిన ఘట్టం అది. ఆ ఘనత సాధించి నేటికి 50ఏళ్లు పూర్తయ్యాయి.

By

Published : Jul 20, 2019, 5:15 AM IST

Updated : Jul 20, 2019, 5:22 AM IST

చంద్రయాన్​

చంద్రునిపై అడుగుపెట్టిన వేళ..

రోజూ రాత్రి... మేడపై నిద్రపోతూ.. ఆకాశంలో చూస్తుంటాం. మిలమిలా మెరిసే నక్షత్రాలు కళ్లకు ఎంతో అందంగా కనిపిస్తాయి. అయితే వాటి మధ్యలో ఉన్న జాబిల్లి మాత్రం మన మనసు దోచేస్తుంది. ఎప్పటికైనా చందమామను అందుకోవాలనే కోరికో... లేక అమ్మ గోరుముద్దలు తినిపిస్తూ చందమామ రావే.. అంటూ చిన్నప్పుడు పాడిన పాట గుర్తొచ్చో... అక్కడికి చేరాలనుకున్నాడు మనిషి.

మనిషి మేధస్సు నిరంతరం ఏదో ఒకటి ఆలోచిస్తూ... అందని దాని కోసం తపిస్తూనే ఉంటుంది. అలానే చందమామలోనూ భూమిలాంటి పరిస్థితులే ఉన్నాయేమో కనుక్కోవాలని తపన పడ్డాడు మనిషి. కానీ అక్కడకు వెళ్లాలంటే అనుకున్నంత సులభం కాదు. అందుకే మేధస్సుకు పదును పెట్టాడు.

నిరంతర కృషితో చల్లని జాబిల్లిపై అడుగు పెట్టేందుకు మార్గం కనుగొన్నాడు. అనుకున్నది సాధించాడు. చంద్రుడిపై చక్కర్లు కొట్టేశాడు. అలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 6 సార్లు నాసా ఆధ్వర్యంలో చంద్రుడిపై దండయాత్ర చేశాడు.

వెళ్లిన ప్రతిసారీ అక్కడి విశేషాలపై పరిశోధన చేస్తూ విజయుడయ్యాడు. ఆ విశేషాలను గుర్తు చేసుకుంటే మానవుడు సాధించలేనిదంటూ ఏదీ లేదేమో అనిపించక మానదు.

చంద్రుడిపై తొలి అడుగు

‘ఒక మనిషిగా ఇది చాలా చిన్న అడుగే కానీ మానవాళికి మాత్రం గొప్ప ముందడుగు’... ఇవి 50 ఏళ్ల క్రితం చంద్రుడిపై తొలి అడుగు మోపిన వ్యోమగామి నీల్​ ఆర్మ్​స్ట్రాంగ్ మాటలు.

1969 జులై 16న 'అపోలో 11' వ్యోమనౌక కెన్నెడీ అంతరిక్ష కేంద్రం నుంచి బయలుదేరింది. ఇందులో ముగ్గురు వ్యోమగాములు నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్, మైకేల్ కొలిన్స్​, బజ్ ఆల్డ్రిన్ చంద్రమండలంపైకి పయనమయ్యారు.

1969 జులై 20న వ్యోమనౌక చంద్రగ్రహాన్ని చేరింది. చంద్రుడిపై అడుగు పెట్టిన తొలి మానవుడిగా ఆర్మ్‌స్ట్రాంగ్ చరిత్రకెక్కారు. సుమారు 21 గంటల 36 నిమిషాల పాటు చంద్రమండలంలో గడిపారు. అక్కడి ఉపరితలం ఛాయా చిత్రాలను తీసుకొని తిరిగి పయనమయ్యారు.

195 గంటల 18 నిమిషాల 35 సెకన్ల సుదీర్ఘ ప్రయాణం అది. యాత్రను విజయవంతంగా ముగించుకొని 1969 జులై 24న భూమిని చేరుకున్నారు. చంద్రునిపై మనిషి తొలిసారి కాలు మోపిన ఆ క్షణాలను అప్పట్లోనే 50 కోట్ల మందికి పైగా టీవీల్లో చూశారు.

గర్వించిన దేశం

అప్పటివరకు ఓ తీరని కలగా మిగిలిపోయిన చంద్రుణ్ని అందుకున్న వ్యోమగాములు ముగ్గురికి అమెరికా ఘన స్వాగతం పలికింది. వారిని ప్రజలు హీరోలుగా భావించారు. ఆగస్టు 13న అమెరికా న్యూయార్క్​ వీధులన్నీ కిక్కిరిసిపోయాయి. మేడలు, మిద్దెలు ఎక్కి మరీ ప్రజలు వ్యోమగాములకు స్వాగతం పలికారు.

40 వసంతాలు

'అపోలో 11' చంద్రుణ్ని చేరి 2009 జులై 20కి 40 ఏళ్లు గడిచిన సందర్భంగా అందులో ప్రయాణించిన ముగ్గురు వ్యోమగాములు నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్, మైకేల్ కొలిన్స్​, బజ్ ఆల్డ్రిన్​ను అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్​ ఒబామా సత్కరించారు. వారిని ప్రశంసించారు.

"ఇలాంటి అవకాశం చాలా అరుదుగా దక్కుతుంది. ముగ్గురు దిగ్గజాలకు ఈ రోజు స్వాగతం పలికాను. వీరు ముగ్గురు అమెరికా హీరోలు."

- బరాక్​ ఒబామా, అమెరికా మాజీ అధ్యక్షుడు

తొలిసారి చంద్రునిపై కాలు మోపిన జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు నీల్​ ఆర్మ్​స్ట్రాంగ్​.

"మనం తెలుసుకోవాలనుకుంటోన్న రహస్యాలు 4 దశాబ్దాల క్రితం కన్నా ఇప్పుడు మనకు దగ్గరగా ఉన్నాయి. వాస్తవ రహస్యాలు ఇంకా మనల్ని ప్రశ్నిస్తూనే ఉన్నాయి. అయినప్పటికీ ఆ రహస్యాలను ఛేదించగలం, అవి వేసే ప్రశ్నలకు సమాధానం కనుక్కోగలం."

-నీల్​ ఆర్మ్​స్ట్రాంగ్​, వ్యోమగామి

2012 ఆగస్టు 25న తన 82 వ ఏట ఆర్మ్​స్ట్రాంగ్​ కన్నుమూశారు.

నేటికి చంద్రునిపై మనిషి కాలుమోపి సరిగ్గా 50 ఏళ్లు పూర్తయింది. అయినా... ఇంకా తెలుసుకోవాల్సినవి ఎన్నో. ఆ రహస్యాలను కనుగొనేందుకు మనిషి మేధోమధనం చేస్తూనే ఉన్నాడు. చంద్రునిపైకి దండయాత్రలు చేస్తూనే ఉన్నాడు.

ఇదీ చూడండి: ఈనెల 22న నింగికెగరనున్న చంద్రయాన్‌-2

Last Updated : Jul 20, 2019, 5:22 AM IST

ABOUT THE AUTHOR

...view details