కరోనా వైరస్ను అరికట్టేందుకు వ్యాక్సిన్ సరఫరా దిశగా సన్నద్ధమవుతోంది అమెరికా. ఇందుకోసం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. తమ దేశానికే ప్రాధాన్యతనిచ్చే విధంగా వ్యాక్సిన్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్పై సంతకం చేశారు. అయితే.. ఆ దేశంలో సుమారు 50శాతం మంది మాత్రమే టీకా వేసుకొనేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్టు.. అసోసియేటెడ్ ప్రెస్-నేషనల్ ఒపీనియన్ రీసెర్చ్ సెంటర్(ఏపీ-ఎన్ఓఆర్సీ) సర్వేలో తేలింది. ఇక పెద్దల్లో పావు వంతు మంది వ్యాక్సిన్ తీసుకోవాలా? వద్దా? అనే సందిగ్ధంలో ఉండగా.. మరో పావు వంతు మంది టీకా తీసుకోమని స్పష్టంగా చెబుతున్నట్టు పేర్కొంది. వ్యాక్సిన్ విషయంలో భద్రతా సమస్యలు ఉంటయనే అనుమానమే ఇందుకు కారణమని సర్వే పేర్కొంది. తొలుత టీకా తీసుకున్న వారిపై ఎలాంటి ప్రభావం ఉంటుందనే దానిపై ఇతరుల నిర్ణయం ఆధారపడినట్టు వెల్లడించింది.
కొవిడ్-19 విజృంభణతో అగ్రరాజ్యంలో ఇప్పటివరకు సుమరు 2లక్షల 90వేల మంది ప్రాణాలు కోల్పోయారు. మరణాల రేటును తగ్గించేందుకు గానూ.. ప్రజల్లో రోగ నిరోధక శక్తిని పెంపొందించడం కోసం.. దేశ జనాభాలో సుమారు 70శాతం మందికి వ్యాక్సిన్ అవసరమని నిపుణులు భావిస్తున్నారు.