అగ్రరాజ్యం అమెరికాలో నవంబర్ 3న 'ఎలక్షన్ డే'(భారత కాలమానం ప్రకారం). ట్రంప్- బైడెన్ అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నారు. వాస్తవానికి అధ్యక్ష ఎన్నికలు జరిగిన ప్రతీసారి పోలింగ్ రోజు అర్ధరాత్రి సమయానికి విజేత ఎవరనేది తెలిసిపోయేది. అయితే.. ఈ సారి అలాంటి అవకాశం లేదు. ఫలితాలు మరింత ఆలస్యమయ్యేలా ఉన్నాయి. ట్రంప్ కూడా ఈ విషాయాన్ని పదే పదే నొక్కి చెబుతున్నారు. ఫలితాలు ఆలస్యం కావడాన్ని ఆయన చాలా తీవ్రంగా పరిగణిస్తున్నారు.
ఇదీ చదవండి:అమెరికా తలరాతను తేల్చేవి ఇవే...
గతంలో మాదిరి కాకుండా ఈసారి ఫలితాల విషయంలో ఎందుకు ఆలస్యం అవుతుంది? ఈ ఎన్నికల్లో కొత్తదనం ఏముంది? తెలుసుకుందాం.
కరోనా విజృంభణ నేపథ్యంలో అమెరికాలో మిలియన్ల మంది అమెరికన్లు మెయిల్ ద్వారా ఓటు వేయాలని నిర్ణయించుకున్నారు. మెయిల్ బ్యాలెట్లు లెక్కించడానికి ఎక్కువ సమయం పడుతుంది.
ఎన్నికల సిబ్బంది మెయిల్ బ్యాలెట్‌ను క్షుణ్నంగా పరిశీలించాల్సి ఉంటుంది. ఏమైనా లోపాలు ఉన్నాయా? లేవా? చూసుకొని.. స్కాన్ చేయాల్సి ఉంటుంది. ప్రతి ఓటుకు ఇదంతా చేయాల్సి ఉంటుంది. అందుకే చాలా సమయం పడుతుంది.
కొన్ని రాష్ట్రాలు వారికి ఉన్న వనరులను బట్టి మెయిల్ ఓట్లను ఎలక్షన్-డే కు కొన్ని వారాల ముందు నుంచే లెక్కిస్తారు. దీంతో ఆయా రాష్ట్రాల్లో ఫలితాలు నిర్ణీత సమయంలోగా వెల్లడయ్యే అవకాశం ఉంది.
ఇదీ చదవండి:చివరి సర్వేలోనూ బైడెన్ జోరు- ట్రంప్‌పై భారీ లీడ్
అయితే.. అనేక రాష్ట్రాల్లో మెయిల్ బ్యాలెట్లను త్వరగా మదింపు చేసే వ్యవస్థలు లేవు. దీనికి తోడు పోలింగ్ రోజుకంటే ముందుగా మెయిల్ ద్వారా వేసిన ఓట్లను లెక్కించడాన్ని నిషేధించారు. దీంతో మెయిల్ ద్వారా వేసిన ఓట్లను, పోలింగ్ బూత్‌లలో వేసిన ఓట్లను ఒకేసారి లెక్కించాల్సి ఉంటుంది.
ఓట్లు లెక్కించకుండానే విజేతను మీడియా సంస్థలు ప్రకటిస్తాయా?
ఓట్ల లెక్కింపు పూర్తి కాకుండానే అసోసియేటెడ్ ప్రెస్‌తో సహా.. ఇతర మీడియా సంస్థలు విజేతను అంచనా వేసే అవకాశం ఉంది. నవంబర్ 3న ఎక్కువ సంఖ్యలో ఓట్లను లెక్కంచడం సాధ్యం కాదు. సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ ఆధారంగా విజేతను అంచనా వేయవచ్చు.
'ఎలక్షన్ డే' రాత్రికి అధ్యక్షుడు ఎవరనేది తెలుసుకునే చివరి అవకాశం ఏమైనా ఉందా?
'ఎలక్షన్ డే' రాత్రికి అధ్యక్షుడు ఎవరనేది అధికారిక ప్రకటన రాకపోయినా.. తెలుసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే అన్ని రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు నెమ్మదిగా ఉండదు. కొన్ని కీలక రాష్ట్రాలు తమ ఫలితాలను వెంటనే విడుదల చేసే అవకాశం ఉంది. అక్కడ వచ్చే మెజార్టీని ఆధారంగా అంచనా వేసుకోవచ్చు.