అమెరికాలో లాక్డౌన్ ఎత్తివేతకు సంబంధించి అంటు వ్యాధి నిపుణులు సూచించిన సలహాలను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాలనా విభాగం ఉన్నత అధికారులు పెడచెవిన పెట్టారని అక్కడి ఏపీ న్యూస్ వార్తా సంస్థ వెల్లడించింది. ఇందుకు సంబంధించిన ఈమెయిల్స్‌ను బహిర్గతం చేస్తూ పరిశోధనాత్మక కథనం ప్రచురించింది. సీడీసీ మార్గదర్శకాలలోని కీలక అంశాలను వదిలేసి కొన్నింటిని మాత్రం హడావుడిగా ఆమోదించాలని చూసినట్లు తెలిపింది.
ఏమిటీ పత్రాలు?
కరోనా కారణంగా అమెరికా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందని, వీలైనంత త్వరగా లాక్డౌన్ ఎత్తివేస్తామని ట్రంప్ చాలా రోజులుగా చెబుతున్నారు. అయితే ఆంక్షల సడలించాలంటే ప్రజలు, పరిశ్రమలు, వ్యాపారులు, విద్యా సంస్థలు సహా ఇతర రంగాలు అనుసరించాల్సిన మర్గాదర్శకాలు, పాటించాల్సిన జాగ్రత్తల గురించి సవివరంగా నివేదిక రూపొందించింది అమెరికా అంటువ్యాదుల నియంత్రణ కేంద్రం(సీడీసీ). దీని ఆమోదం కోసం ట్రంప్ సహా శ్వేతసౌధం అధికారులకు 60 పేజీలకుపైగా ఉన్న నివేదికను ఏప్రిల్ 13న ఈమెయిల్ చేసింది. వెబ్సైట్లో ప్రచురిస్తామని పేర్కొంది.
అధికారుల నుంచి స్పందన రాకపోగా సీడీసీ డైరెక్టర్ రెడ్‌ఫీల్డ్ ఏప్రిల్ 24న మరోసారి మెయిల్ చేశారు. నివేదికను సమీక్షించి ఆమోదం తెలపాలని కోరారు.
ఆ తర్వాత రెండు రోజులకు ఏప్రిల్ 26న ఆమోద ప్రక్రియ ఎంతవరకు వచ్చిందో తెలియజేయాలని, వీలైనంత త్వరగా నివేదికను ప్రచురించాలని శ్వేతసౌధం అధికారులకు మెయిల్ చేశారు సీడీసీ చీఫ్ స్టాఫ్ రాబర్డ్ మెక్ గోవన్. నివేదికను వైట్ హౌస్ ప్రిన్సిపల్స్ కమిటీ సమీక్షించాలని, ఆ తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని గోవన్కు శ్వేతసౌధం అధికారి బెక్ తిరిగి మెయిల్ చేశారు.
ఆ మరునాడే ఇదే తరహా మెయిల్‌ను మరో అధికారి సీడీసీకి పంపారు. వెస్ట్ వింగ్ ప్రిన్సిపల్ కమిటీ చెప్పేంత వరకు నివేదికను ప్రచురించడానికి అనుమతించబోమని తేల్చి చెప్పారు.
లాక్‌డౌన్‌కు మే1 నుంచి ఎత్తివేయాలని ట్రంప్ తొలుత భావించిన నేపథ్యంలో ఆ రోజు వరకు ఆమోదం లభిస్తుందేమోనని సీడీసీ భావించింది. అయినప్పటికీ ఎలాంటి పురోగతి లేదు. సీడీసీ మార్గదర్శకాలను ట్రంప్ పాలనా యంత్రాంగం పట్టించుకోవడం లేదని ఏపీ న్యూస్ మీడియా తెలిపింది.