కరోనాపై పోరాటం, ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ.... ప్రస్తుతం ప్రపంచం ముందున్న ప్రధాన సవాళ్లు. ఈ రెండింటి మధ్య సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నాయి అనేక దేశాలు. కానీ... అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకే ఎక్కువ ప్రాధాన్యమిచ్చారని అనేక విమర్శలు వెల్లువెత్తాయి. అయినా అవేవీ లెక్కచేయకుండా ముందడుగు వేశారాయన. ఆర్థిక కార్యకలాపాల పునరుద్ధరణకు పచ్చజెండా ఊపారు. ఆంక్షల సడలింపుపై రాష్ట్రాల వారీగా నిర్ణయాలు తీసుకునేందుకు గవర్నర్లకు అధికారాలిచ్చారు.
అయితే... ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణలోనూ ట్రంప్ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఓ పరిశోధనలో తేలింది. వ్యాపారాలు, పరిశ్రమలు ప్రారంభించేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో నిపుణుల కమిటీ స్పష్టంగా సూచించినా... ప్రభుత్వం బేఖాతరు చేసిందని తెలిసింది.
సీడీసీ సిఫార్సులు..
అమెరికాలో సురక్షితంగా వ్యాపార కార్యకలాపాలను ఎలా పునరుద్ధరించాలో సీడీసీ నిపుణులు సూచనలు చేశారు. భవిష్యత్తులో కరోనా కేసులు మళ్లీ పెరిగితే ఎలాంటి చర్యలు తీసుకోవాలో కూడా వివరించారు.
అయితే ట్రంప్ ప్రభుత్వం ఏప్రిల్ 30న ఈ సిఫార్సులను తిరస్కరించింది. నిపుణులు సూచించిన పత్రాలు ప్రచురణకు అనర్హమని గత వారం శ్వేతసౌధం ప్రకటించింది.