భారత్-పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు పెరగకుండా ఉండేందుకు చర్చల ద్వారా పరిష్కారం కనుగొనేందుకు కృషి చేయాలని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ సూచించారు. ఈ దేశాల నడుమ ఏదైనా సైనిక ఘర్షణ తలెత్తితే ఆ రెండు దేశాలతో పాటు ప్రపంచాన్ని ప్రమాదంలో పడేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. కశ్మీర్ అంశంలో భారత్-పాక్‌ల సంబంధాలపై దాయాది జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు ఈ మేరకు సమాధానమిచ్చారు గుటెరస్.
కశ్మీర్‌పై ఇరు దేశాల మధ్య ప్రస్తుత పరిస్థితులు సవ్యంగా ఉన్నట్టు కనిపించట్లేదన్న గుటెరస్.. సైన్యంతో పరిష్కారం ఎంతమాత్రం సముచితం కాదని అభిప్రాయపడ్డారు. భారత్-పాక్‌లు అంగీకరిస్తే శాంతియుత పరిష్కారం కనుగొనేందుకు తమకు అభ్యంతరం లేదన్నారు. భారత్-పాక్‌ల మధ్య ఉన్న సమస్యలపై కచ్చితంగా చర్చ జరగాల్సిన అవసరం ఉందని తెలిపారు.
"చర్చల ప్రక్రియను వేగవంతం చేయాల్సిన అవసరం ఉంది. అది అత్యంత అవసరమని నమ్ముతున్నాం. అయితే ఆ చర్చలు భారత్-పాక్ సరిహద్దుల్లో.. నియంత్రణ రేఖపై చేపట్టాల్సి ఉందని చెప్పగలను. ఈ ప్రాంతంలో మానవ హక్కులకు గౌరవమివ్వాలి."