స్వల్పస్థాయి కొవిడ్-19 లక్షణాల నుంచి కోలుకున్నవారిలో కొన్ని నెలల తర్వాత కూడా రోగనిరోధక కణాలు కరోనా వైరస్ను నిర్వీర్యం చేసే యాంటీబాడీలను ఉత్పత్తి చేస్తున్నాయని తాజా అధ్యయనం పేర్కొంది. ఇలాంటి కణాలు జీవతకాలం కొనసాగే వీలుందని తెలిపింది. అందువల్ల వారు అనారోగ్యం బారినపడే అవకాశం తక్కువని వివరించింది. అమెరికాలోని వాషింగ్టన్ యూనివర్సిటీ ఆఫ్ మెడిసిన్ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు.
కొవిడ్ నుంచి కోలుకున్నవారిలో సంబంధిత యాంటీబాడీలు త్వరగా క్షీణిస్తాయని ఇప్పటికే కొన్ని విశ్లేషణలు వచ్చాయి. దీన్నిబట్టి వారిలో కరోనా నుంచి రక్షణ దీర్ఘకాలం కొనసాగదని కొందరు సూత్రీకరించినట్లు పరిశోధనల్లో పాలుపంచుకున్న అలీ అలెబేడీ చెప్పారు. "అయితే ఇది డేటాకు వక్ర భాష్యం చెప్పడమే. తీవ్రస్థాయి ఇన్ఫెక్షన్ తర్వాత యాంటీబాడీలు తగ్గిపోవడం సహజమే. అవి సున్నా స్థాయికి పడిపోవు" అని పేర్కొన్నారు. వైరల్ ఇన్ఫెక్షన్ సోకినప్పుడు యాంటీబాడీలను ఉత్పత్తి చేసే రోగనిరోధక కణాలు వేగంగా తమ సంఖ్యను పెంచుకుని, రక్తంలో సంచరిస్తాయని చెప్పారు.
"ఆ కణాలు యాంటీబాడీల సంఖ్యను తారస్థాయికి పెంచుతాయి. ఇన్ఫెక్షన్ నయమయ్యాక ఈ కణాలు చాలావరకు నశిస్తాయి. ఫలితంగా రక్తంలో యాంటీబాడీల స్థాయి తగ్గిపోతుంది. యాంటీబాడీలను ఉత్పత్తి చేసే కణాల్లో కొన్ని దీర్ఘకాలం కొనసాగుతాయి. వాటిని ప్లాస్మా కణాలుగా పేర్కొంటారు. అవి ఎముక మజ్జలోకి వెళ్లిపోతాయి. అక్కడి నుంచే అవి యాంటీబాడీలను రక్తంలోకి విడుదల చేస్తాయి" అని చెప్పారు. కొవిడ్ నుంచి కోలుకున్న 77 మందిపై పరిశోధన చేసిన శాస్త్రవేత్తలు ఈ మేరకు తేల్చారు. వీరిలో చాలామందికి స్వల్పస్థాయిలోనే ఇన్ఫెక్షన్ సోకింది. ఆరుగురే ఆస్పత్రిలో చేరారు.