పోలీసు అమానుష ప్రవర్తన కారణంగా ప్రాణాలు కోల్పోయిన నల్లజాతీయుడు జార్జి ఫ్లాయిడ్ మృతికి సంఘీభావంగా ప్రపంచవ్యాప్తంగా ర్యాలీలు జరిగాయి. బ్రిటన్‌లో ఫ్లాయిడ్ ఘటన వ్యతిరేక నిరసనలు హోరెత్తాయి. వందలాదిమంది ఆందోళనకారులు లండన్‌లోని అమెరికా దౌత్య కార్యాలయాన్ని ముట్టడించారు. నల్లజాతీయులకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు. 17వ శతాబ్దం నాటి ఓ బానిసల వ్యాపారి విగ్రహాన్ని నిరసనకారులు ధ్వంసం చేశారు. విదేశాంగ, ఖజానా కార్యాలయాల ముందు నిరసనల సందర్భంగా పోలీసులు, ఆందోళనకారుల మధ్య బాహాబాహీ జరిగింది. అమెరికాలో శాంతియుతంగా ఆందోళనలు చేశారు నిరసనకారులు.
హాంకాంగ్‌లో..
హాంకాంగ్‌లో ఫ్లాయిడ్ మృతికి సంఘీభావంగా పలువురు నిరసనలు చేపట్టారు. అమెరికా కౌన్సలేట్ ముందు ఆందోళన చేశారు. 'జాతి వివక్ష.. ప్రపంచ సమస్య' అంటూ నినదించారు.
ఇటలీ.. స్ప్రాలింగ్ స్క్వేర్ వద్ద
ఇటలీ రాజధాని రోమ్‌లోని స్ప్రాలింగ్ పీపుల్స్ స్క్వేర్ వద్ద ఫ్లాయిడ్ మృతికి నిరసనగా ర్యాలీ తీశారు. 'ఇట్స్ ఏ వైట్ ప్రాబ్లమ్', 'బ్లాక్ లైవ్స్ మాటర్' అనే నినాదాలు మిన్నంటాయి. 21వ శతాబ్దంలో కూడా రంగు వివక్ష చూపేవారు కుష్ఠురోగులని పలువురు ఆందోళనకారులు వ్యాఖ్యానించారు.
స్పెయిన్‌లో..
స్పెయిన్‌లో ఫ్లాయిడ్ మృతికి నిరసనగా వేలసంఖ్యలో ప్రజలు ఆందోళన చేపట్టారు. బార్సిలోనా వీధులు 'జాతి వివక్ష సమసిపోవాల'నే నినాదాలతో హోరెత్తాయి. మాడ్రిడ్‌లోని అమెరికా కౌన్సలేట్ కార్యాలయం ముందు స్థానికులు ఆందోళన చేశారు.