అమెరికాలోని ప్రవాస భారతీయులు 71వ గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. అయితే.. ఈ వేడుకల వేదికగా పౌరసత్వ సవరణ చట్టానికి అనుకూలంగా, వ్యతిరేకంగా శాంతియుత ర్యాలీలు నిర్వహించారు ప్రవాసీలు.
పలు నగరాల్లో సీఏఏ, ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా భారీ సంఖ్యలో ప్రవాసీలు నినాదాలు చేశారు. పౌర చట్టాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
అంతకుమించి మద్దతుదారులు..
అయితే.. సీఏఏను వ్యతిరేకిస్తూ ఆందోళనలకు దిగిన వారికన్నా ఎక్కువ సంఖ్యలో మోదీ అనుకూలవాదులు పౌర చట్టానికి మద్దతు తెలుపుతూ.. ర్యాలీలు చేపట్టారు. పొరుగు దేశాల్లోని మైనారిటీలను భారత్ కాపాడుతోందని.. సీఏఏతో భారత పౌరులపై ఎలాంటి ప్రభావం ఉండదని నినాదాలు చేశారు. మైనారిటీల కోసం కీలక నిర్ణయం తీసుకున్నందుకు మోదీకి కృతజ్ఞతలు తెలిపారు.
న్యూయార్క్, చికాగో, హ్యూస్టన్, అట్లాంటా, శాన్ఫ్రాన్సిస్కోలోని భారత దౌత్య కార్యాలయాలతో పాటు వాషింగ్టన్లోని రాయబార కార్యాలయం వద్ద ఈ మద్దతుదారులు, నిరసనకారులు ప్రదర్శనలు చేపట్టారు.