సార్స్‌కోవ్-2 వైరస్ సహజంగా వృద్ధి చెందిందంటే ఒక పట్టాన నమ్మకం కలగడంలేదని.. దానిపై దర్యాప్తు నిర్వహించాలని అమెరికాకు చెందిన అంటువ్యాధుల చికిత్సా నిపుణుడు ఆంటోని ఫౌచీ పేర్కొన్నారు. ఆయన 'యునైటెడ్ ఫాక్ట్ ఆఫ్ అమెరికా: ఎ ఫెస్టివల్ ఆఫ్ ఫ్యాక్ట్‌చెకింగ్' అనే కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా.. 'మీరు ఇంకా కరోనావైరస్ సహజంగా వచ్చిందనే నమ్ముతున్నారా?' అని ప్రశ్నించగా ఆయన స్పందించారు.
"నాకు దానిపై నమ్మకం కలగటంలేదు. మనం చైనాలో ఏం జరిగిందనేదానిపై శక్తికొద్దీ దర్యాప్తు నిర్వహించి ఒక నిర్ణయానికి రావాలి. ముఖ్యంగా ఇప్పటికే దీని గురించి తనిఖీ చేసినవారు మాత్రం ఇది జంతువుల నుంచే మనుషులకు సోకినట్లు చెబుతున్నారు. కానీ, ఇంకా తెలుసుకోవాల్సింది ఏదో ఉంది.. దానిని వెలికి తీయాలి. అందుకే వైరస్ పుట్టుక తెలుసుకొనేందుకు ఎప్పుడూ పారదర్శకమైన దర్యాప్తునకు నేను మద్దతు ఇస్తాను"
-ఆంటోని ఫౌచీ, అంటువ్యాధుల చికిత్సా నిపుణుడు