తెలంగాణ

telangana

ETV Bharat / international

Anthony Fauci: 'కరోనాను అంతం చేయడం అసాధ్యం' - ఆంటోనీ ఫౌచీ

Anthony Fauci Covid News: కరోనా మహమ్మారిని తట్టుకొని మనిషి మనుగడ సాగించే స్థితికి అమెరికా వెళ్తోందన్నారు ఆ దేశ అంటువ్యాధుల చికిత్స నిపుణుడు ఆంటోనీ ఫౌచీ. కొత్తగా పుట్టుకొస్తున్న మ్యూటేషన్లు, వ్యాక్సిన్‌ తీసుకోని వ్యక్తుల కారణంగా కరోనా వైరస్‌ సమూల నిర్మూలన అసాధ్యమని వెల్లడించారు.

anthony fauci news
ఫౌచీ

By

Published : Jan 12, 2022, 2:58 PM IST

Anthony Fauci Covid News: అమెరికాలో కరోనా వైరస్‌, ఒమిక్రాన్‌ వేరియంట్‌ కారణంగా కేసుల ఉప్పెన కొనసాగుతోంది. ఈ వ్యాధిని తట్టుకొని మనిషి మనుగడ సాగించే స్థితికి అమెరికా వెళ్తోందని ఆ దేశ టాప్‌ అంటువ్యాధుల చికిత్స నిపుణుడు ఆంటోనీ ఫౌచీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన అమెరికాలోని ప్రఖ్యాత సెంటర్‌ ఫర్ స్ట్రాటజిక్‌ అండ్‌ ఇంటర్నేషనల్‌ స్టడీస్‌ (సీఎస్‌ఐఎస్‌)లో ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. కొవిడ్‌ను అంతం చేయడం అనేది అభూత కల్పనే అని అభిప్రాయపడ్డారు. ఒమిక్రాన్‌కు ఉన్న వ్యాప్తి వేగం కారణంగా అది ప్రతి ఒక్కరిలో కనిపిస్తోందని పేర్కొన్నారు. కొత్తగా పుట్టుకొస్తున్న మ్యూటేషన్లు, వ్యాక్సిన్‌ తీసుకోని వ్యక్తుల కారణంగా కరోనావైరస్‌ (coronavirus) సమూల నిర్మూలన అసాధ్యమని వెల్లడించారు. సమయానికి వ్యాక్సిన్లు తీసుకొన్నవారు.. వైరస్‌ కారణంగా తలెత్తే తీవ్ర పరిణామాలను తప్పించుకొంటారు. కానీ, వ్యాక్సిన్ల సామర్థ్యం కూడా తగ్గుతోందని ఫౌచీ అభిప్రాయపడ్డారు.

కరోనా తట్టుకొనే దిశగా అమెరికా..

అమెరికాలో ఒమిక్రాన్‌ కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఫౌచీ అన్నారు. ఈ క్రమంలో దేశం కొత్త దశలోకి అడుగు పెడుతుందని అంచనా వేశారు. టీకాల కారణంగా పూర్తి రక్షణ పొందిన ప్రజలు.. ఆరోగ్య సమస్యలున్నవారు వైరస్‌ బారిన పడినా.. తేలిగ్గా చికిత్స చేయడానికి సరిపడా ఔషధాలు ఉన్న స్థితికి దేశం చేరుతుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం రోజుకు మిలియన్‌కు పైగా కేసులు.. 1,50,000 మందికి ఆసుపత్రుల్లో చికిత్సలు .. 1,200 మంది ప్రాణాలు కోల్పోతుండటం వల్ల.. తాను అంచనా వేసిన స్థితికి అమెరికా ఇంకా చేరుకోలేదన్నారు. కేవలం ప్రారంభం వద్దే ఉందని అభిప్రాయపడ్డారు.

ఫౌచీ, రిపబ్లికన్‌ సెనెటర్‌ మధ్య వాగ్వాదం..

సౌమ్యుడు.. ముక్కుసూటిగా మాట్లాడే మనస్తత్వం ఉన్న ఆంటోనీ ఫౌచీ రిపబ్లికన్‌ సెనెటర్‌ రాండ్‌పౌల్‌పై నిప్పులు చెరిగారు. "అతడిలోని పిచ్చితనాన్ని బయటపెట్టుకొని.. ప్రాణాలపైకి తెచ్చుకోవడం సహా కుటుంబాన్ని కూడా రాండ్‌ పౌల్‌ వేధిస్తున్నాడు" అంటూ ఫౌచీ మండిపడ్డారు. అమెరికా కాంగ్రెస్‌ విచారణలో తాజాగా ఈ వ్యాఖ్యలు చేశారు. కరోనా వ్యాప్తిపై వాంగ్మూలం ఇచ్చేందుకు అమెరికా అధ్యక్షుడి సలహాదారు ఫౌచీ, సీడీసీ డైరెక్టర్‌ రోఛెల్లె వాలెన్‌స్కీ, ఎఫ్‌డీఏ హెడ్‌ జానెట్‌ ఉడ్‌కుక్‌ సెనెట్‌ ఎదుట హాజరయ్యారు.

అమెరికాలో పరీక్షలు, కొవిడ్‌ క్వారంటైన్‌ నిబంధనల్లో గందరగోళంపై కమిటీ సభ్యులు.. వైద్య నిపుణులను పలు ప్రశ్నలు అడిగారు. ఈ సమయంలో రిపబ్లికన్ సెనెటర్‌ రాండ్‌ ఫౌల్‌ మాట్లాడుతూ ప్రజలకు వ్యాక్సిన్‌ను తప్పనిసరి చేయడాన్ని వ్యతిరేకించారు. అంతేకాదు.. స్వయంగా టీకా తీసుకోవడానికీ తిరస్కరించారు. అధ్యక్షుడిగా బైడెన్‌ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి నిత్యం వందల సంఖ్యలో అమెరికన్లు మృతి చెందడానికి కూడా ఫౌచీనే కారణమని తప్పుబట్టారు.

వీటిపై ఆంటోనీ ఫౌచీ తీవ్రంగా స్పందించారు. పౌల్‌వి పూర్తిగా నిరాధారణమైన ఆరోపణలని తోసిపుచ్చారు. "ఆయన వ్యక్తిగత ఆరోపణలతో దాడి చేశారు. ఆ ఆరోపణలకు ఒక్క ఆధారమైనా ఉందా..? ఇలాంటి ఆరోపణలు పిచ్చొళ్లను రెచ్చగొడుతున్నాయి.. నాకు, నా కుటుంబానికి, పిల్లలకు బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయి" అని ఫౌచీ వాపోయారు.

గత డిసెంబర్‌లో ఓ వ్యక్తి ఏఆర్‌-15 రైఫిల్‌ తీసుకొని కాలిఫోర్నియా నుంచి వాషింగ్టన్‌ డీసీకి వస్తుండగా పోలీసులు అరెస్టు చేశారు. అతడు తనను చంపేందుకు బయల్దేరినట్లు పేర్కొన్న విషయాన్ని తాజా విచారణలో ఫౌచీ గుర్తు చేశారు.

హెచ్‌ఐవీపై పోరుకు కొత్తబాటలు వేసింది ఫౌచీనే..

డాక్టర్‌ ఫౌచీ 1983 నుంచి పార్టీలతో సంబంధం లేకుండా ఏడుగురు అమెరికన్‌ అధ్యక్షుల వద్ద అత్యున్నత స్థానాల్లో పనిచేశారు. సైన్స్‌ వ్యాసాలు రాసే 30 లక్షల మంది రచయితలు అత్యధికసార్లు ప్రస్తావించిన పేర్లలో ఫౌచీ 13వ స్థానంలో ఉన్నారు. వాస్తవానికి ఎయిడ్స్‌ నిరోధానికి ప్రపంచ వ్యాప్తంగా అనుసరించే వ్యూహాల రూపకర్తల్లో ఫౌచీ ప్రముఖుడని జాన్‌హప్‌కిన్స్‌ యూనివర్శిటీ నివేదిక వెల్లడిస్తోంది. కండోమ్స్‌, సూదుల వాడకంపై ఆంక్షలు వంటి కీలక వ్యూహాలను సిద్ధం చేశారు. హెచ్‌ఐవీపై ఆయన చేసిన పరిశోధనలు చరిత్రలో నిలిచిపోతాయి.

ఇదీ చూడండి :సిబ్బంది కొరత- కరోనా సోకిన నర్సులతోనే వైద్య సేవలు

ABOUT THE AUTHOR

...view details