తెలంగాణ

telangana

ETV Bharat / international

ఈ విషయాల్లో మౌనమే ట్రంప్ కొంప ముంచుతోంది! - trump russia

ప్రత్యర్థులపై గొంతుచించుకొని విమర్శలు చేయడం, ప్రతి విషయానికీ తనదైన రీతిలో సమాధానం చెప్పడం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యవహార శైలి. మరి అలాంటి ట్రంప్​ కొన్ని ముఖ్యమైన అంశాల్లో మౌనం పాటించి చిక్కులు కొనితెచ్చుకుంటున్నారు. చివరకు ఆ విషయాలే అధ్యక్ష పీఠానికీ ముప్పుగా పరిణమిస్తున్నాయి. అసలు ట్రంప్ మౌనం వహిస్తున్న విషయాలేంటి?

Analysis: What Trump leaves unspoken carries consequences
ఈ విషయాల్లో మౌనమే ట్రంప్ కొంప ముంచుతోంది!

By

Published : Jul 3, 2020, 12:04 PM IST

దైనా విషయం గురించి అసలు ఆలోచించకుండానే మాట్లాడేయడంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​ ముందుంటారు. తన బుర్రలో మెదిలిన ఆలోచనలను టక్కున చెప్పేయడానికి వెనకాడరు. మంచైనా, చెడైనా, తన 'అజ్ఞానాన్ని' ప్రతిబింబించే విషయమైనా వెంటనే బయటకు చెప్పేస్తారు. ఆ తర్వాతే దాని పర్యవసానాల గురించి ఆలోచిస్తారు. ఇదే అసలు సిసలైన ట్రంప్ మనస్తత్వం!

కానీ ఇప్పుడు అతను మాట్లాడని కొన్ని విషయాలే అధ్యక్ష పీఠానికి ఎసరుపెట్టేలా ఉన్నాయి. ట్రంప్ మౌనం వహిస్తున్న కొన్ని అంశాలే ఎన్నికలకు సంబంధించిన అతిముఖ్యమైన సమస్యలతో ముడిపడి ఉన్నాయి.

అందులో ప్రధానమైనవి

  • రష్యాతో వివాదం
  • మాస్కు తప్పనిసరిగా ధరించడం
  • జాతి విద్వేషం

డెమొక్రటిక్​ పార్టీ అయినా, రిపబ్లికన్ పార్టీ అయినా... అధ్యక్ష పదవి చేపట్టినవారందరూ చిరకాల ప్రత్యర్థి రష్యాకు వ్యతిరేకంగా గళమెత్తినవారే. కరోనా వైరస్ వంటి ప్రజారోగ్య అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు వైద్య నిపుణుల సలహాలనూ అందరు అధ్యక్షులు పాటించారు. జాత్యహంకారాన్ని రూపుమాపడానికి అమెరికన్లు తమ అభిప్రాయాలు చెప్పాలని ప్రజలందరికీ ఆయా అధ్యక్షులు పిలుపునిచ్చారు.

మరి ట్రంప్?

కానీ ట్రంప్ నోటి నుంచి ఇలాంటి పదాలేవీ అంత సులభంగా రావు! కరోనా వైరస్, జాతి వివక్ష సహా రష్యాపై తన అభిప్రాయం గురించి ఇటీవల స్పందించిన ట్రంప్... అమెరికాలోని మెజారిటీ ప్రజలు తనవెంటే ఉన్నారంటూ బదులిచ్చారు. ఇలాంటి విషయాల్లో మౌనం పాటించడం వల్ల సంక్షోభాలు మరింత తీవ్రమవుతున్నాయి. ఈ సమస్యలన్నీ శ్వేతసౌధాన్ని చుట్టుముట్టి ట్రంప్​ను ఎన్నికల ప్రమాదంలో పడేలా చేస్తున్నాయి.

"ప్రజలకు ఇప్పుడు సరైన సందేశం ఇచ్చే ఉత్తమమైన నాయకుడు అవసరం. అలాంటి లక్షణాలు ఉన్నాయని ఊహించుకునే వారు కాదు."

-కాల్విన్ జిల్​సన్, సదరన్ మెథొడిస్ట్ విశ్వవిద్యాలయ చరిత్రకారుడు

అఫ్గానిస్థాన్​లో అమెరికా దళాలను చంపినందుకు తాలిబన్ సంబంధిత ఉగ్రవాదులకు రష్యా బహుమతులు(బౌంటీ) ఇచ్చిందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయం గురించి అధ్యక్షుడికి ఎప్పుడో తెలుసని ఇటీవల వచ్చిన కథనాలు ట్రంప్​ను మరింత కుంగదీస్తున్నాయి. ఇలాంటి ఆరోపణల మధ్య అధ్యక్షుడి హోదాలో ఉన్న ట్రంప్.. ప్రజల్లోకి వచ్చి ఈ విషయంపై ఎందుకు మాట్లాడటం లేదని విపక్షాలు గొంతెత్తి విమర్శిస్తున్నాయి. రష్యా వ్యవహారంపై దర్యాప్తు చేసే విధంగా హామీ ఇవ్వాలని నిలదీస్తున్నాయి.

ఇదీ చదవండి-'అమెరికా దళాలపై దాడులకు రష్యా కుట్ర'

రష్యాను తేలికగా తీసుకునే ట్రంప్ వ్యవహార శైలి వాషింగ్టన్​తో పాటు అమెరికావ్యాప్తంగా ప్రజలకు నిరాశ కలిగిస్తోంది. 2018 హెల్సింకిలో అమెరికా-రష్యా మధ్య జరిగిన శిఖరాగ్ర సదస్సులో ట్రంప్ మాట్లాడిన విషయం ఇందుకు మరింత బలం చేకూర్చుతోంది. 2016 అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకుందని అమెరికా నిఘా వర్గాల అనుమానాలకు వ్యతిరేకంగా మాట్లాడటం నిపుణులనూ విస్మయానికి గురిచేసింది.

అనుకూల విషయాలనూ ప్రస్తావించరా?

ఓ వైపు ఈ బౌంటీ ఆరోపణలకు ఆధారాలేవీ లేవని శ్వేతసౌధం స్పష్టం చేసింది. రష్యా ప్రవర్తనకు తగిన రీతిలో శిక్షించామని తన మూడేళ్ల పాలనలో తీసుకున్న చర్యలను ట్రంప్ వివరించి తన విమర్శకులకు గట్టి జవాబు ఇవ్వవచ్చు. కానీ కీలక సందర్భాల్లో ట్రంప్ మాట్లాడిన మాటలే మాస్కో పట్ల రాజీ వైఖరితో ఉన్నారన్న సందేశం రష్యాకు వెళ్లిందని నిపుణులు భావిస్తున్నారు.

ఇదీ చదవండి-ఈ విషయంలో మాత్రం ట్రంప్, బైడెన్​ది ఒకే మాట

"రష్యా గురించి మాట్లాడేందుకు ట్రంప్ నిరాకరిస్తున్నారంటే.. 2016 ఎన్నికల్లో తనను ఎన్నుకోవడంలో మాస్కో సహాయపడిందా అనే అనుమానం వస్తోంది. రష్యా ప్రస్తావన రాగానే.. ఆయన్ను(ట్రంప్​ను) ఎన్నుకోవడంలో ఆ దేశం పాత్రపై ప్రశ్నలు వస్తాయని అనుకుంటున్నారు."

-కథ్లీన్ హాల్ జెమీసన్, అన్నెబర్గ్ పబ్లిక్ పాలసీ సెంటర్ డైరెక్టర్, పెన్సిల్వేనియా యూనివర్సిటీ

మరోవైపు రష్యాను జీ7 దేశాల కూటమిలోకి చేర్చుకోవాలని తాజాగా ట్రంప్ ప్రతిపాదించారు. రష్యా బౌంటీ ఆరోపణలపై స్పష్టతనివ్వకుండా.. రిపబ్లికన్లకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న మీడియాపై విరుచుకుపడేందుకే ప్రాధాన్యమిచ్చారు.

మాస్కులకు దూరం

ఇక మాస్కులు విషయానికి వస్తే... బహిరంగ ప్రదేశాల్లో ట్రంప్ తన ముఖానికి మాస్కు ధరించడం చాలా అరుదు. అసలు అలాంటి దాఖలాలు ఇప్పటికీ కెమెరా కంటపడలేదు. మాస్కులు ధరించనని ట్రంప్ ఇప్పటికే తెగేసి చెప్పేశారు. ప్రజలు ధరించాలా వద్దా అనే నిర్ణయాన్ని వారికే వదిలేస్తున్నానని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు.

ఇదీ చదవండి-ట్రంప్​ అధ్యక్ష పదవికి '2020' ఎసరు!

బహిరంగ ప్రదేశాల్లో కరోనా నియంత్రణకు మాస్కే చాలా కీలకమని నిపుణులు ఘోషిస్తున్నారు. ట్రంప్ వ్యవహారమంతా నిపుణుల సూచనలను బేఖాతరు చేసే విధంగా ఉంది.

"మాస్కు ఉపయోగంపై ట్రంప్ సరిగా అవగాహన కల్పించకపోవడం వల్ల అమెరికాలో విధ్వంసకర పరిస్థితులు తలెత్తాయి. నాయకులు సరైన సందేశం ఇవ్వకుండా ప్రజల విశ్వాసం కోల్పోవడమే కరోనా విషయంలో మెరుగ్గా పనిచేస్తున్న దేశాలకు, విఫలం అవుతున్న దేశాలకు మధ్య తేడా."

-లారెన్ గోస్టిన్, ప్రజా వైద్య నిపుణుడు, జార్జిటౌన్ విశ్వవిద్యాలయం

చివరకు సొంత పార్టీ నేతలే ట్రంప్​ను మాస్క్ ధరించాలని అభ్యర్థిస్తున్నారు. ట్రంప్ మాస్క్ ధరిస్తే తన అభిమానులు, ప్రజలు అనుసరిస్తారని చెబుతున్నారు. అయినా సరే అధ్యక్షుడు తన నిర్ణయాన్ని మార్చుకోలేదు.

ఇదీ చదవండి-'ట్రంప్​ బెదిరింపుల్లో నాటి జాతి విద్వేష భాష'

జాతి వివక్షపైనా మౌనం

ఇక చివరిది జాతి విద్వేషం. జార్జి ఫ్లాయిడ్ మరణం తర్వాత అమెరికా సహా ప్రపంచవ్యాప్తంగా శ్వేతజాతీయుల వర్ణ వివక్షకు వ్యతిరేకంగా తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయి. అగ్రరాజ్యంలోని అన్ని రాష్ట్రాల్లో ఆందోళనలు మిన్నంటాయి. ఈ సమయంలో పరిస్థితిని చక్కదిద్దాల్సింది పోయి... నిరసనకారుల ఆగ్రహాన్ని మరింత పెంచేలా ప్రవర్తించారు ట్రంప్. ఆందోళనల పేరిట లూఠీలు చేస్తున్నవారిపై కాల్పులు జరుపుతామంటూ హెచ్చరించారు. నిరసనలను అణచివేయాడానికి సైన్యాన్ని రంగంలోకి దించుతానని ప్రకటించారు. ఫ్లాయిడ్ ఘటన సహా జాతి విద్వేషంపై పెద్దగా స్పందించలేదు. ఇవన్నీ ఒక అధ్యక్షుడి హుందా వ్యవహారానికి చాలా దూరంగా ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇవీ చదవండి

ABOUT THE AUTHOR

...view details