కొవిడ్ వ్యాక్సిన్ తయారీలో కీలక మైలురాయిని చేరినట్టు అమెరికన్ బయోటెక్నాలజీ కంపెనీ హీట్ బయోలాజిక్స్ ప్రకటించింది. కొవిడ్ బాధితులు కోలుకోవాలంటే వారిలో యాంటీబాడీస్ ఉత్పత్తితో పాటు కణ రోగనిరోధక శక్తి అవసరం. రోగుల్లో 30% మంది ఈ సామర్థ్యం కోల్పోతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలున్న వారు ఈ పరిస్థితితోనే మృతి చెందుతున్నారు. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని రోగుల్లో దీర్ఘకాలిక కణ రోగ నిరోధకశక్తిని పెంపొందించేలా వ్యాక్సిన్ రూపొందించినట్టు హీట్ బయోలాజిక్స్ పేర్కొంది. ఈ వ్యాక్సిన్ శరీరంలోని కరోనా వైరస్ స్పైక్ ప్రొటీన్‌ను లక్ష్యంగా చేసుకుంటుంది. అందుకోసం శరీరంలో వైరస్ భక్షక కణాలను విస్తరిస్తుంది. అలాగే యాంటీబాడీస్ మెరుగయ్యేలా సహాయపడుతుంది. త్వరలో ప్రయోగ పరీక్షలకు సిద్ధమవుతున్నామని హీట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జెఫ్ ఓస్ తెలిపారు.
కరోనా వ్యాక్సిన్ తయారీలో అమెరికా సక్సెస్! - కరోనా మందు తయారీ చేసిన అమెరికన్ బయోటెక్నాలజికల్ కంపెనీ
కరోనాను నియంత్రించే మందు తయారీలో కీలక మైలురాయిని చేరుకున్నట్లు తెలిపింది అమెరికన్ బయోటెక్నాలజీ కంపెనీ హీట్ బయోలాజిక్స్. వైరస్ బాధితులు కోలుకోవడానికి వారి శరీరంలో నిరోధకశక్తిని పెంపొందించేలా వ్యాక్సిన్ రూపొందించినట్లు వెల్లడించింది.

ఇవి ఊహించని సమస్యలు!
కరోనా కట్టడికి తయారు చేసే కొన్ని టీకాల ప్రయోగ పరీక్షల్లో సమస్యలు ఎదురు కావొచ్చని బ్రిటన్‌కు చెందిన కోబ్రా బయోలాజిక్స్ గ్రూప్ ప్రతినిధి ఒకరు చెబుతున్నారు. "ఒకవేళ టీకాలు పూర్తిస్థాయిలో తయారై ట్రయల్స్‌కు సిద్ధమయ్యే లోపు కరోనా కనుమరుగైతే ప్రయోగించేందుకు వైరస్ సోకిన వారు దొరక్కపోవచ్చు. మరో ఇబ్బందీ లేకపోలేదు. టీకాలు సిద్ధమయ్యేలోగా ప్రపంచంలోని ప్రజలందరికీ కరోనా వ్యాపిస్తే... ప్రయోగానికి అవసరమైన వైరస్ సోకని వాలంటీర్లు ఉండక పోవచ్చు" అని ఆయన సందేహాలు వ్యక్తంచేశారు. టీకా తయారీ కోసం కోబ్రా బయోలాజిక్స్ గ్రూప్, ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ కొన్ని వారాల క్రితం ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈమేరకు ఆక్స్‌ఫర్డ్‌లోని పరిశోధకులు గతవారం కొందరు వాలంటీర్లపై టీకా ప్రయోగాలను మొదలుపెట్టారు. ‘వ్యాక్సిన్ సామర్థ్యాన్ని గుర్తించడమనేది... వేసవిలో కరోనా వ్యాప్తి చెందే తీరుపై ఆధారపడి ఉంటుంది’ అని కోబ్రా బయోలాజిక్స్ సేల్స్ మార్కెటింగ్ డైరెక్టర్ ఫిలిప్ రిడ్లీ స్మిత్ తెలిపారు.
TAGGED:
corona special stories