కరోనా వైరస్‌ను చైనా అద్భుతంగా కట్టడి చేసిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ప్రశంసించింది. సమాజం మళ్లీ సాధారణ స్థితికి ఎలా చేరుకుందో వుహాన్‌ను చూసి ప్రతి దేశం నేర్చుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. అక్కడ కొత్త కేసులేవీ నమోదు కాకపోవడం సంతోషకరమని వ్యాఖ్యానించింది.
వుహాన్ నగరంలోనే మొట్టమొదట కరోనా వెలుగుచూసింది. అక్కడి నుంచి ప్రపంచమంతా పాకేసింది. వైరస్ వ్యాప్తితో దాదాపు సగం ప్రపంచం ఆంక్షల మధ్యే జీవిస్తోంది. ఆర్థిక వ్యవస్థలన్నీ అతలాకుతలం అయ్యాయి. ఈ నేపథ్యంలో చైనా సరైన సమయంలో సంపూర్ణ వివరాలు ఇవ్వలేదని, మహమ్మారిని నియంత్రించడం, ఇతర దేశాలను హెచ్చరించడంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ విఫలమైందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విమర్శించారు. బీజింగ్ యంత్రాంగం మరింత పారదర్శకంగా ఉండాల్సిందని అనేక దేశాలు అంటున్నాయి.
వుహాన్‌లో కరోనా కేసులు సంఖ్య సున్నాకు చేరడంపై డబ్ల్యూహెచ్‌ఓ ప్రతినిధి మరియా వాన్ కెర్‌ఖోవె చైనాను అభినందించారు. 'వుహాన్‌లో కరోనా రోగులు లేకపోవడం, ప్రమాదకర కేసులేమీ లేవని తెలియడం స్వాగతించదగ్గ విషయం. ఈ ఘనత సాధించినందుకు అభినందనలు’ అని మరియా పేర్కొన్నారని చైనా అధికార మీడియా సంస్థ షిన్హువా తెలిపింది.