అమెరికాలో మంచు తుపాను తగ్గుముఖం పట్టట్లేదు. పలు రాష్ట్రాల్లో తుపాను కారణంగా నిలిచిపోయిన విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు గురువారం నుంచి అధికారులు ప్రయత్నాలను వేగవంతం చేశారు. కానీ పెరుగుతున్న తుపాను తీవ్రత పనులకు ఆటంకం కలిగించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
బుధవారం నాటికి దేశవ్యాప్తంగా 34 లక్షల మంది ప్రజలు అంధకారంలో గడుపుతున్నారు. మంచు తీవ్రత అత్యధికంగా ఉన్న టెక్సాస్, అర్కంసాస్ రాష్ట్రాల పరిస్థితి దయనీయంగా మారింది. విద్యుత్ ప్రభావం నీటి సరఫరా పైన కూడా పడింది. దక్షిణ రాష్ట్రాల్లో హిమపాతం కారణంగా నీటి సమస్య తలెత్తింది. ఒక్లాహోమా, నెబ్రాస్కా రాష్ట్రాల్లో పరిస్థితి కుదుటపడుతోంది. అయితే ఈ ప్రాంతాల్లో గ్యాస్‌కు డిమాండ్ పెరిగింది.
ఈ వారంలో తుపాను కారణంగా 24 మంది ప్రాణాలు కోల్పోయారు. టెక్సాస్‌లో ఇప్పటివరకు 6 లక్షల మంది వినియోగదారులకు విద్యుత్ సరఫరా పునరుద్ధరించామని విద్యుత్ శాఖ వెల్లడించింది. ప్రజల సమస్యలపై స్పందించిన ఉపాధ్యక్షురాలు కమలా హారిస్.. సహాయక చర్యలు ముమ్మరం చేశామని అన్నారు.
"విద్యుత్ లేని కారణంగా వారు మనల్ని చూడలేరని నాకు తెలుసు. వారి పరిస్థితిని మేము అర్థం చేసుకోగలము. అధ్యక్షుడు జో బైడెన్, నేను యుద్ధప్రాతిపదికన వారికి వీలైనంత వరకు సహాయం కృషి చేస్తున్నాము."