తెలంగాణ

telangana

ETV Bharat / international

90 నిమిషాల 'ఆపరేషన్​ బాగ్దాదీ'​ సాగిందిలా..! - ISIS leader Abu Bakr-al Baghdadi update news

ఇస్లామిక్​ స్టేట్​ ఉగ్రసంస్థ అగ్రనేత అబు బకర్​ అల్​ బాగ్దాదీని అంతం చేయటంలో అమెరికా విజయం సాధించింది. సిరియా ఇడ్లిబ్​ ప్రాంతంలో తలదాచుకుంటున్న బాగ్దాదీని మట్టుబెట్టేందుకు అగ్రరాజ్యం ఎలాంటి ప్రణాళిక రచించిందో, శనివారం రాత్రి చేపట్టిన ఆపరేషన్​ ఏ విధంగా సాగిందో తెలుసుకుందాం.

బగ్దాదీ ఆపరేషన్ సాగిందిలా..!

By

Published : Oct 28, 2019, 11:20 AM IST

Updated : Oct 28, 2019, 2:40 PM IST

ఒసామా బిన్​ లాడెన్​...! అగ్రదేశాలను సైతం గడగడలాడించిన ఉగ్రనేత. ఆల్​ఖైదా ముష్కర ముఠాకు అధినేత. 9/11 దాడుల తర్వాత అతడి కోసం విస్తృతంగా గాలించాయి అమెరికా బలగాలు. చివరకు పాకిస్థాన్​లో తలదాచుకుంటున్నట్లు గుర్తించాయి. మూడో కంటికి తెలియకుండా మెరుపుదాడి చేసి... లాడెన్​ను మట్టుబెట్టాయి.
'ఆపరేషన్​ ఒసామా' జరిగి 8 ఏళ్లు గడిచాయి. ఇప్పుడు మరోమారు అలాంటి మెరుపుదాడే చేసింది అగ్రరాజ్యం. ఈసారి ఇస్లామిక్​ స్టేట్ ఉగ్రవాద సంస్థ అగ్రనేత అబు బకర్ అల్​ బాగ్దాదీ వంతు. వేదిక... సిరియాలోని ఇడ్లిబ్​.

పక్కా ప్రణాళికతో...

ప్రపంచంలో ఎన్నో ఉగ్రసంస్థలు ఉన్నాయి. వాటన్నింటిలో ఐఎస్​ ఎంతో ప్రత్యేకం, ప్రమాదకరం. అతి తక్కువ సమయంలోనే శక్తిమంతమైన, సంపన్నమైన ముష్కర ముఠాగా గుర్తింపు తెచ్చుకుంది ఐఎస్​. బాగ్దాదీ నేతృత్వంలో ఆ సంస్థ చేసిన అకృత్యాలు అన్నీఇన్నీ కావు. అందుకే 'ఆపరేషన్​ బాగ్దాదీ'ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది అమెరికా. సిరియాలోని ఇడ్లిబ్​ ప్రాంతంలో బాగ్దాదీ తలదాచుకుంటున్నట్లు పక్కా సమాచారంతో అత్యున్నత స్థాయిలో వ్యూహరచన చేసింది. ఈ ఆపరేషన్​ను వారం క్రితమే అధ్యక్షుడు ట్రంప్​ ఆమోదించినట్లు సమాచారం.

ఎనిమిది హెలికాప్టర్లతో దాడి..

ఇడ్లిబ్​ ప్రాంతం బరీష గ్రామంలోని ఓ భవనంలో బాగ్దాదీ తలదాచుకుంటున్నట్లు గుర్తించాయి బలగాలు. అతడ్ని మట్టుబెట్టేందుకు 8 హెలికాప్టర్లను వినియోగించాయి. సైనికులతో పాటు శిక్షణ పొందిన జాగిలాలు, ఓ రోబోనూ వెంట తీసుకెళ్లాయి. శనివారం రాత్రి బాగ్దాదీ ఉంటున్న భవనంపై ఒక్కసారిగా మెరుపుదాడి చేశాయి.

ఆ కొద్ది నిమిషాలు...

బరీష గ్రామంలోని రహస్య స్థావరంలో బాగ్దాదీతోపాటు చాలా మంది ఉన్నారు. వారిలో ఇద్దరు మహిళలు, 11 మంది చిన్నారులు. ఆ ఇద్దరు మహిళలు బాగ్దాదీ భార్యలే అని తెలిసింది.

భవనం వెనుకవైపు గోడను బద్దలు కొట్టి ఇంట్లోకి ప్రవేశించారు సైనికులు. లోపలున్నవారు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. భయంతో పరుగులు తీసే ప్రయత్నం చేశారు. బాగ్దాదీ అనుచరుల్లో చాలా మందిని అమెరికా బలగాలు మట్టుబెట్టాయి. మరికొందరిని అదుపులోకి తీసుకున్నాయి.

స్థావరం నుంచి బయటకు వచ్చిన ఆఖరి వ్యక్తి బాగ్దాదీనే. అతడితోపాటు 11 మంది చిన్నారులు కూడా ఉన్నారు. వారు అతడి పిల్లలే అని అనుమానం.

బాగ్దాదీ, ఇద్దరు మహిళలు పేలుడు పదార్థాలను శరీరానికి చుట్టుకొని సొరంగంలోకి పరిగెత్తారు. వారిని జాగిలాలు వెంబడించాయి. సొరంగం చివరికి చేరుకోగానే ఏం చేయాలో తెలియక తనను తాను పేల్చేసుకున్నాడు బాగ్దాదీ. అతడితోపాటు ఇద్దరు మహిళలు, ముగ్గురు చిన్నారులు మరణించారు.

"బాగ్దాదీ ఏడుస్తూ, భయంతో అరుస్తూ పరిగెత్తాడు. సొరంగం చివరికి వెళ్లి చనిపోయాడు. ఇప్పటివరకు అందరినీ బెదిరించేందుకు ప్రయత్నించిన ఆ గూండా... తన జీవితంలో చివరి క్షణాల్ని తీవ్రమైన భయంతో, ఆందోళనతో గడిపాడు. అమెరికా బలగాలు తనను చంపేస్తున్నాయని వణికిపోయాడు. చివరకు బాగ్దాదీ కుక్క చావు చచ్చాడు. ఓ పిరికిపందలా చచ్చాడు."

-డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు

బాగ్దాదీ ఆత్మాహుతికి పాల్పడతాడని అమెరికా బలగాలు ముందే ఊహించాయి. అందుకే వీలుంటే అతడ్ని పట్టుకునేందుకు ఓ రోబోను తీసుకెళ్లాయి. ఆ రోబో ఎంతో ప్రత్యేకమైంది. ఇంతకుముందు ఏ ఆపరేషన్​లోనూ దానిని ఉపయోగించలేదు. కానీ... ఈసారి దాని అవసరం రాలేదు.

ఆపరేషన్​ బాగ్దాదీ 90 నిమిషాల్లోనే పూర్తయింది. పేలుడు ధాటికి సొరంగం మొత్తం ధ్వంసమైంది. అమెరికా జవాన్లు శిథిలాలు తొలగించి, బగ్దాదీ మృతదేహాన్ని గుర్తించారు. ఆత్మాహుతి దాడిలో అతడి శవం ముక్కలుముక్కలు అయింది. వాటినే సేకరించి, పరీక్షలకు పంపారు.

అమెరికాకు జరిగిన నష్టం అదే...

ఈ ఆపరేషన్​లో అమెరికా సైన్యానికి ఎలాంటి హాని జరగలేదు. ఓ శునకం మాత్రం గాయపడింది. దానిని జవాన్లు తిరిగి స్వదేశానికి తీసుకొచ్చి, చికిత్స ఇప్పిస్తున్నారు.

"ఈ ఆపరేషన్​లో ఏ ఒక్కరు గాయపడలేదు. ఓ అందమైన, ప్రతిభావంతమైన జాగిలానికి మాత్రమే గాయమైంది."

- డొనాల్డ్​ ట్రంప్​, అమెరికా అధ్యక్షుడు

మైక్​ పెన్స్​ టర్కీ పర్యటనలోనే..

ఈ ఆపరేషన్​ జరిగిన ప్రదేశం టర్కీకి కేవలం 3 మైళ్ల దూరంలోనే ఉంది. గతంలో ఐసిస్​కు టర్కీ మద్దతుదారుగా ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల అమెరికా ఉపాధ్యక్షుడు మైక్​ పెన్స్​ టర్కీ పర్యటన సందర్భంగా ఆపరేషన్​కు అంకురార్పణ జరిగినట్లు సమాచారం.

ఇదీ చూడండి: బాగ్దాదీ మరణం పట్ల ప్రపంచ దేశాల హర్షం

Last Updated : Oct 28, 2019, 2:40 PM IST

ABOUT THE AUTHOR

...view details