కొవిడ్ నిర్ధరణ పరీక్షల మార్గదర్శకాలను సవరిస్తూ అమెరికా వ్యాధి నియంత్రణ, నిర్మూలణ కేంద్రాలు(సీడీసీ) తీసుకున్న నిర్ణయాన్ని అమెరికా రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. కొవిడ్ సోకిన వారికి దగ్గరగా మెలిగిన వ్యక్తులకు లక్షణాలు లేకుంటే కొవిడ్ టెస్ట్ అవసరం లేదని సీడీసీ ఈ మధ్యే మార్గదర్శకాల్లో పేర్కొంది. దీన్ని అమెరికాలోని మెజారిటీ రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. అంతేకాకుండా సీడీసీ తాజా మార్గదర్శకాలను పక్కకుపెట్టి మరీ కొవిడ్ పరీక్షలను నిర్వహిస్తున్నాయి.
అనుమానం ఉంటే పరీక్ష చేసుకోవాలి!
లక్షణాలు లేకున్నప్పటికీ వైరస్ సోకిన వారితో సన్నిహితంగా మెలిగినా, అనుమానం ఉన్నా కొవిడ్ పరీక్ష చేయించుకోవాలని సూచిస్తున్నాయి. దాదాపు అమెరికాలో 33 రాష్ట్రాలు సీడీసీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా టెక్సాస్, ఒక్లహోమా, ఆరిజోనా రాష్ట్రాలు సీడీసీ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ.. అనుమానం ఉన్న ప్రతిఒక్కరికీ కొవిడ్ పరీక్షలు చేసుకోవాలని సూచిస్తున్నాయి.