కరోనా వైరస్ చైనాలోని వుహాన్ ల్యాబ్‌లోనే ఆవిర్భవించిందనే అనుమానాలకు బలం చేకూరేలా మరో నివేదిక బయటకు వచ్చింది. చైనా పరిశోధన కేంద్రం నుంచే మహమ్మారి పుట్టినట్లు అమెరికాలోని రిపబ్లికన్ ప్రతినిధి మైక్ మెక్‌కాల్ ఆరోపించారు. వుహాన్ ల్యాబ్‌లో కరోనా వైరస్ మానవులకు సోకేలా జన్యుపరమైన మార్పులు చేశారని, ఆ సంగతి దాచిపెట్టారని ఆరోపించారు. ఇందుకు తగిన సాక్ష్యాలు ఉన్నాయన్నారు. వుహాన్ ల్యాబ్ వద్ద పటిష్ఠమైన భద్రతా చర్యలు లేవన్నారు. ప్రమాదకర వ్యర్థాలను ఎప్పటికప్పుడు శుద్ధి చేసే వ‌్యవస్థ కూడా సరిగా లేదని తెలిపారు. కరోనా మహమ్మారి కారణంగా గత రెండేళ్లలో ప్రపంచవ్యాప్తంగా 44 లక్షల మంది మరణించారంటూ మెక్‌కాల్ ఆవేదన వ్యక్తం చేశారు.
'జంతువుల నుంచి కాదు..'
వైరస్ సీ ఫుడ్ మార్కెట్ ద్వారా జంతువుల నుంచి మనుషులకు వ్యాపించిందనే ఓ వాదనను కూడా రిపబ్లికన్లు విడుదల చేసిన నివేదిక ఖండించింది. వుహాన్ ల్యాబ్ నుంచే కరోనా వైరస్ లీకైందని అది కూడా 2019 సెప్టెంబర్ 12కు ముందే ఇది జరిగిందని పేర్కొంది.