నాయకత్వం కోసం అమెరికా తపిస్తోందని ఆ దేశ ఉపాధ్యక్ష పదవికి డెమొక్రటిక్ పార్టీ తరఫున పోటీ చేసేందుకు ఎన్నికైన కమలా హారిస్ విమర్శించారు. డెమోక్రాట్ల అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్‌తో కలిసి డెలావర్ విల్మింగ్టన్లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై విమర్శలు గుప్పించారు. కరోనా కట్టడిలో ఆయన నిర్లక్ష్యం కారణంగానే అమెరికన్లు మహా మాంధ్యం నాటి ఆర్థిక సంక్షోభ పరిస్థితుల్లో కూరుకుపోయారని ధ్వజమెత్తారు.
కరోనా కట్టడికి అమెరికన్లంతా కచ్చితంగా మాస్కులు ధరించాలని కోరారు కమలా, బైడెన్. అలా చేస్తే కొన్ని నెలల్లో 40వేల మంది దేశ పౌరుల ప్రాణాలు కాపాడవచ్చని ఆరోగ్య నిపుణులు చెప్పినట్లు పేర్కొన్నారు.
ఒక్కరోజే భారీగా నిధులు
కమలా హారిస్‌ను ఉపాధ్యక్ష అభ్యర్థిగా ప్రకటించిన ఒక్క రోజులోనే జో బైడెన్ ప్రచారానికి మద్దతుగా భారీగా నిధులు సమకూరాయి. 24 గంటల్లో సుమారు 26 మిలియన్ డాలర్ల నిధులు అందాయి. ఈ మొత్తం గతంలో సమీకరించిన ఒక రోజు మొత్తం కంటే రెట్టింపు అని, డెమోక్రాట్లను ప్రజలు ఆదరిస్తున్నారనడానికి ఇదే ఉదాహరణ అని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
జో బైడెన్ ప్రచారానికి ఆయన తరఫున నిధుల సమీకరణలో కీలకంగా వ్యవహరిస్తున్న కమలా హారిస్‌ను అభ్యర్థిగా ప్రకటించడం ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. తమ ప్రచారానికి మద్దతుగా పెద్ద మొత్తంలో నిధులు రావడం తనకెంతో ఉత్సాహాన్ని కలిగిస్తోందని జో బైడెన్ పేర్కొన్నారు. డెమోక్రటిక్ పార్టీకి కల్పతరువుగా భావించే కాలిఫోర్నియాలో కమలా హారిస్‌కు బలమైన దాతలు ఉన్నారు. అలానే హారిస్‌కు భారత్, ఆఫ్రికన్ మూలాలు ఉండంటం కలిసొచ్చే అంశంగా భావిస్తున్నారు.
ఇదీ చూడండి: విభేదాలకు చెక్.. ఇజ్రాయెల్-యూఏఈ చారిత్రక ఒప్పందం