రూపాలు మార్చుకుంటూ ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారి అమెరికాలో మరోసారి విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో భవిష్యత్లో కరోనా వల్ల కలిగే ఇబ్బంది మరింత తీవ్రమవ్వొచ్చని అమెరికా అంటువ్యాధుల నిపుణుడు ఆంథోనీ ఫౌచీ ఆందోళన వ్యక్తం చేశారు. 'డెల్టా వైరస్ ప్రభావంతో పరిస్థితులు మరింత దారుణంగా మారనున్నాయి' అని ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చెప్పుకొచ్చారు.
దేశవ్యాప్తంగా పది కోట్ల మంది వ్యాక్సిన్ తీసుకోవాల్సినవారు ఉన్నప్పటికీ.. ముందుకు రావడం లేదని ఫౌచీ ఆందోళన వ్యక్తం చేశారు. ఇది ప్రస్తుత పరిస్థితిని మరింత దిగజార్చవచ్చని హెచ్చరించారు. ఇప్పటివరకూ 60శాతం మంది అమెరికన్లు మాత్రమే పూర్తిగా టీకా తీసుకున్నారు. ఇక పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్నప్పటికీ మరోసారి దేశవ్యాప్త లాక్‌డౌన్ విధించే అవకాశం లేదని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ సందర్భంగా టీకా తీసుకోవడం అనేది వ్యక్తిగత నిర్ణయం అని వాదించే వారిపై విమర్శలు గుప్పించారు.