అధునాతన పరిజ్ఞానం, ఆయుధాలను అందించడం ద్వారా భారత రక్షణ అవసరాలను తీర్చడానికి తాము సిద్ధంగా ఉన్నామని అమెరికా పేర్కొంది. రష్యా నుంచి ఎస్-400 దీర్ఘశ్రేణి క్షిపణి రక్షణ వ్యవస్థను కొనుగోలు చేయకూడదని మెలిక పెట్టింది. ఆ వ్యవస్థను కొంటే భారత్-అమెరికా మైత్రి పరిమితంగానే కొనసాగుతుందని స్పష్టం చేసింది.
రష్యా నుంచి 'ఎస్-400' వ్యవస్థను కొనుగోలు చేస్తే భారత్-అమెరికా సంబంధాలపై తీవ్ర ప్రభావం తప్పదని ట్రంప్ సర్కార్‌లోని ఓ సీనియర్ అధికారి హెచ్చరించారు.
రష్యా నుంచి కొనుగోలు చేయవద్దు..
వివాదానికి కేంద్ర బిందువుగా ఉన్న సదరు క్షిపణి రక్షణ వ్యవస్థ అత్యంత అధునాతనమైనది. ఈ క్షిపణి కొనుగోలుకు గతేడాది భారత్- రష్యా మధ్య 500 కోట్ల డాలర్ల విలువైన ఒప్పందం కుదిరింది. తాజాగా అమెరికా విదేశాంగశాఖ ఉన్నతాధికారి ఆలిస్ జీ వెల్స్ ఈ అంశమై కాంగ్రెస్ విదేశీ వ్యవహారాల ఉపకమిటీకి వివరణ ఇచ్చారు. భారత్‌తోనే అమెరికా ఎక్కువగా సైనిక విన్యాసాలను నిర్వహిస్తోందని తెలిపారు.
"ట్రంప్ ప్రభుత్వ హయాంలో మేము చాలా స్పష్టంగా ఉన్నాం. భారత రక్షణ అవసరాలను తీర్చే విషయంలో సాయం అందిస్తాం. ఇప్పటికే ఆ దేశానికి ఇచ్చిన 'ప్రధాన రక్షణ భాగస్వామి' హోదా ఆధారంగా మైత్రిని మరింతగా ముందుకు తీసుకెళుతున్నాం. పదేళ్ల కిందటితో పోలిస్తే ఇప్పుడు అనేక రకాల ఆయుధాలను భారత్‌కు ఇస్తున్నాం. మరింత పెంచే దిశగా ఆ దేశంతో మాట్లాడుతున్నాం. అయితే రష్యా నుంచి ఎస్-400 వ్యవస్థ కొనుగోలు వల్ల భారత్-అమెరికా బంధం మధ్య సమన్వయం కుంటుపడుతుంది." - ఆలిస్ జీ వెల్స్, అమెరికా విదేశాంగశాఖ ఉన్నతాధికారి.
విభిన్న దేశాల నుంచి ఆయుధాలను కొనుగోలు చేసే ప్రక్రియను భారత్ మొదలుపెట్టిందని ఆలిస్ పేర్కొన్నారు. ఇప్పటికే ఆ దేశ ఆయుధాల్లో 65 నుంచి 70 శాతం రష్యా నుంచి వచ్చినవే అని ఆయన వెల్లడించారు.
ఇదీ చూడండి: ప్రత్యేక హోదా కోసం నితీశ్, జగన్ పార్టీలతో బీజేడీ కూటమి!