ఇరాన్‌పై అమెరికా మరోమారు ఆంక్షలు విధించింది. తాజా ఆంక్షలకు సంబంధించిన కార్యనిర్వాహక ఆదేశాలపై అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. అమెరికా డ్రోన్‌ను ఇరాన్ కూల్చివేసిన కొద్ది రోజుల అనంతరం ఇరాన్‌పై మరిన్ని ఆంక్షలు విధించాలని ట్రంప్ నిర్ణయించారు. దీని వల్ల ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త వాతావరణం తారాస్థాయికి చేరింది.
అణ్వాయుధాలు వీడేంత వరకు ఇరాన్‌పై ఒత్తిడి పెంచే చర్యలు ఉపసంహరించుకోమని ట్రంప్ స్పష్టం చేశారు. ఇరాన్‌తో యుద్ధం కోరుకోవట్లేదని పునరుద్ఘాటించారు. ఈ అంశంలో అమెరికా ఇప్పటికే ఎంతో నిగ్రహం ప్రదర్శించిందని, భవిష్యత్తులోనూ ఇదే కొనసాగుతుందని భావించవద్దని హెచ్చరించారు ట్రంప్.
అమెరికా- ఇరాన్ మధ్య రోజురోజుకు పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాస భద్రతా మండలి సోమవారం సమావేశమైంది. ఇరు దేశాలు సమస్యలను సత్వరమే పరిష్కరించుకోవాలని సూచించింది.