కొవిడ్-19 బాధితుల చికిత్స కోసం ప్లాస్మాను ఉపయోగించడానికి అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్‌డీఏ) అత్యవసర ఆమోదం తెలిపింది. ఈ విధానంతో పొంచి ఉన్న ముప్పుల కన్నా కలిగే ప్రయోజనాలే చాలా ఎక్కువని పేర్కొంది. ఆసుపత్రిపాలైన కరోనా బాధితుల చికిత్స కోసం ప్రయోగాత్మకంగా కాన్వలసెంట్ ప్లాస్మాను ఉపయోగించేందుకు గతంలో అత్యవసర అనుమతి ఇచ్చినట్లు ఎఫ్‌డీఏ తెలిపింది. ఆ ప్రయోగాల్లో వెలువడిన శాస్త్రీయ డేటాను విశ్లేషించి, దీన్ని చికిత్సా విధానంగా అనుమతించాలని తాజాగా నిర్ణయించినట్లు పేర్కొంది. ఇప్పటివరకూ దేశంలో 70 వేల మందికిపైగా బాధితులకు ఈ చికిత్స చేశారని తెలిపింది. కరోనా నుంచి కోలుకున్న వారి రక్తం నుంచి ఈ ప్లాస్మాను సేకరిస్తారు. ఇందులో వైరస్‌తో పోరాడే యాంటీబాడీలు ఉంటాయి.
ఎఫ్‌డీఏ తీసుకున్న తాజా నిర్ణయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వాగతించారు. అంతకుముందు రోజు ఆయన ఎఫ్‌డీఏపై విరుచుకుపడుతూ ట్వీట్లు చేశారు. రాజకీయ కారణాలతో టీకాలు, చికిత్స విధానాలకు సంస్థ అడ్డుపడుతోందని మండిపడ్డారు.