తెలంగాణ

telangana

ETV Bharat / international

టైటానిక్ గుట్టు విప్పే ఆపరేషన్​కు ట్రంప్​ బ్రేక్​!

1912, ఏప్రిల్​ 15న సముద్రంలో మునిగిపోయిన టైటానిక్ రహస్యాలను ఛేదించాలని.. ఓ సంస్థ చేపట్టనున్న అన్వేషణ ప్రక్రియకు అడ్డుతగులుతోంది అమెరికా ప్రభుత్వం. ఓడ అవశేషాల నుంచి వైర్​లెస్​ టెలీగ్రాఫ్​ను వెలికి తీసేందుకు గతంలో ఆ సంస్థకు ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలని వర్జీనియాలోని ఫెడరల్​ కోర్టును ఆశ్రయించింది.

By

Published : Jun 10, 2020, 5:13 PM IST

titanic news
టైటానిక్​ టెలీగ్రాఫ్​

'టైటానిక్‌' అనగానే ప్రపంచాన్ని కుదిపేసిన ఓ పెను విషాదం గుర్తుకొస్తుంది. నడి సముద్రంలో జరిగిన ఆ దుర్ఘటనలోని కొన్ని అంశాలకు కాల్పనికత, గ్రాఫిక్స్​ జోడించి సినిమా తీస్తేనే ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. ఏకంగా 11 ఆస్కార్​ అవార్డులు దక్కే స్థాయిలో ఆదరించారు.

అయితే... ఆ​ నౌక గురించిన కొన్ని విషయాలు ఇప్పటికీ రహస్యాలుగానే ఉండిపోయాయి. మంచుఖండాన్న ఢీకొట్టి సముద్రంలో సమాధి అయిపోయేటప్పుడు ఆ ఓడలో ఏం జరిగిందో చెప్పడానికి సరైన సమాధానాలే లేవు. అయితే వాటిని తెలుసుకోవాలని ఓ అన్వేషణ యాత్ర ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేసింది అట్లాంటాకు చెందిన ఆర్ఎంఎస్ టైటానిక్ కంపెనీ. ఆ నాటి పడవ ప్రమాదానికి సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు, సాక్ష్యాలు సేకరించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా పడవలో కీలకంగా భావించే వైర్​లెస్​ టెలీగ్రాఫ్​ను వెలికితీసేందుకు అనుమతి పొందింది. ఆగస్టులో ఇందుకు సంబంధించిన అన్వేషణ ప్రక్రియ ప్రారంభించే అవకాశం ఉండగా.. దాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది అమెరికా. ఆ యాత్రకు అనుమతి రద్దు చేయాలని వర్జీనియాలోని ఫెడరల్​ కోర్టులో పిటిషన్​ వేసింది.

గతంలో అనుమతి...

టైటానిక్​ శిథిలాలను వెలికితీసే హక్కుల్ని 1980లో అట్లాంటాకు చెందిన ఆర్ఎంఎస్ టైటానిక్ కంపెనీకి ఇచ్చింది అమెరికా కోర్టు. ఆ ప్రక్రియలో నౌక శిథిలాలు మాత్రం చెదిరిపోకుండా చూసుకోవాలని స్పష్టం చేసింది. అయితే అది సాధ్యం కాదని అమెరికా ప్రభుత్వం తరఫున న్యాయవాదులు వాదిస్తున్నారు. ఇప్పటికే ద నేషనల్ ఓషన్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ (ఎన్​ఓఏఏ) సహా అనేక సంస్థలు, వ్యక్తులు ఆనాటి కోర్టు నిర్ణయాన్ని వ్యతిరేకించారు.

ఆ రేడియో ద్వారా ఆ దారుణ ఘటనకు సంబంధించి రహస్యాలు, సంభాషణలు బయట పడే అవకాశం ఉందని ఆర్ఎంఎస్ టైటానిక్ చెప్తోంది. వీలైనంత వరకు నౌక అవశేషాలు దెబ్బతినకుండా చూస్తామని స్పష్టం చేసింది. ఇప్పటికీ ఆ టెలీగ్రాఫ్ గదికి వెళ్లేందుకు మార్గం ఉందని.. సూర్య కాంతిలోనే దాన్ని చేరుకోవచ్చని కంపెనీ తరఫున న్యాయవాదులు వాదిస్తున్నారు.

1912లో టైటానిక్ ఓడ ఇంగ్లాండ్​ నుంచి న్యూయర్క్​ వెళ్తుండగా.. మంచు ఖండాన్ని ఢీకొట్టి అట్లాటింక్ సముద్రంలో మునిగిపోయింది. ఆ ప్రమాదంలో సుమారు 1,508 మంది ప్రాణాలు కోల్పోగా 700 మంది బతికి బయటపడినట్లు అంచనా. ఆ మార్కోనీ టెలీగ్రాఫ్​ సాయంతోనే దగ్గర్లోని నేవీ బృందాలు సమాచారం అందుకొని.. సహాయక చర్యలు చేపట్టినట్లు కొందరు అధికారులు పేర్కొన్నారు.

ఇదీ చూడండి: ఆ మహిళ మెయిల్​తో డిక్షనరీలో పదానికి అర్థం మార్పు!

ABOUT THE AUTHOR

...view details