అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, ఆయన సోదరుడితో కలిసి అంతరిక్షంలో విహరించే అవకాశం ఎవరికి దక్కనుందనే అంశంపై ఆసక్తి నెలకొంది. ఇందుకోసం నిర్వహించిన వేలం ప్రక్రియ శనివారంతో ముగియగా.. 2.80 కోట్ల డాలర్లకు బిడ్ దాఖలు చేసిన వ్యక్తిని అదృష్టం వరించింది. అయితే ఆ వ్యక్తి పేరును బ్లూ ఆరిజిన్ సంస్థ వెల్లడించలేదు. అంతరిక్ష యాత్ర ప్రారంభమయ్యేందుకు కొద్ది రోజుల ముందు ఆ వివరాలు వెల్లడించనున్నారు.
అంతరిక్షంలో విహరించే అవకాశం కోసం శుక్రవారం నాటికి 159 దేశాలకు చెందిన సుమారు 7500 మంది ఆన్‌లైన్ ద్వారా నమోదు చేసుకున్నారు. వీరిలో అత్యధిక ధరకు బిడ్ దాఖలు చేసిన 20 మంది బిడ్డర్లతో శనివారం వేలం ప్రక్రియ నిర్వహించారు. ఈ వేలంలో 2.80 కోట్ల అమెరికన్ డాలర్లకు బిడ్ దాఖలు చేసిన వ్యక్తికి అంతరిక్ష యానం చేసే అరుదైన అవకాశం లభించింది. బిడ్డింగ్ మొత్తాన్ని బ్లూ ఆరిజిన్ ఫౌండేషన్, క్లబ్ ఫర్ ది ఫ్యూచర్‌కు విరాళంగా అందించనుంది. సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథ్స్ రంగాలకు సంబంధించిన కెరీర్‌లను ఎంచుకునేలా భావితరాల్లో స్ఫూర్తినింపేందుకు అంతరిక్షంలో జీవనానికి సంబంధించిన పరిశోధనలకు ఈ నిధులు వినియోగిస్తారు.
ఇదీ చదవండి:ప్రపంచ రారాజు.. అపర కుబేరుడు.. జెఫ్ బెజోస్