తెలంగాణ

telangana

ETV Bharat / international

అమెజాన్​ కార్చిచ్చు... మనిషి మనుగడకే ముప్పు - ఈక్వెడార్​

భూమిపై వాయుకాలుష్య నియంత్రణలో, ఉష్టోగ్రతల పెరుగుదలను ఎదుర్కోవడంలో అమెజాన్​ అడవులు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇటీవల ఇక్కడ కార్చిచ్చులు పెరిగిపోయాయి. ఎన్నో రకాల జీవవైవిధ్యానికి నెలవైన అమెజాన్​ అడవులను అగ్నికీలలు దహిస్తున్నాయి. ఈ కార్చిచ్చే... మనిషి మనుగడకు అత్యంత ప్రమాదంగా మారుతుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు.

మానవాళికి చిచ్చు!

By

Published : Aug 27, 2019, 7:15 PM IST

Updated : Sep 28, 2019, 12:10 PM IST

ప్రాణికోటి మనుగడకు ఆధారభూతమైన ప్రకృతి దైవమైతే, ఆ జీవకోటికి అందే ప్రాణవాయువుల్లో 20 శాతానికి పూచీపడుతున్న అమెజాన్‌ అడవులు ‘దైవమాత’గా పర్యావరణవేత్తల సన్నుతులందుకొంటున్నాయి. భారతావనికి రెట్టింపు పరిమాణంలో బ్రెజిల్‌, పెరూ, కొలంబియా, ఈక్వెడార్‌, బొలీవియా, గయానా, సురినామ్‌, ఫ్రెంచ్‌ గయానాల్లో 26 లక్షల చదరపు మైళ్ల పరిమాణంలో విస్తరించి ఉన్న అమెజాన్‌ అరణ్యాలు- ధరిత్రికి ఊపిరితిత్తుల్లా ప్రకృతి ప్రసాదించిన బాధ్యతను నిర్వర్తిస్తున్నాయి.

భూతాపానికి కారణభూతమవుతున్న బొగ్గుపులుసు వాయువును పీల్చి, ఆక్సిజన్‌ను అందించి, ప్రపంచ జల చక్రభ్రమణాన్ని నియంత్రించి, దూరతీరాల దాకా వర్షపాతాన్ని విశేషంగా ప్రభావితం చేసే అమ్మ లాంటి అమెజాన్‌ గుండెల్లో నేడు మంటలు రేగుతున్నాయి. విశ్వవ్యాప్తంగా గల వృక్ష జంతుజాలంలో 30 శాతానికి, కనీసం 10 శాతం జీవవైవిధ్యానికి నెలవైన అమెజాన్‌ను నిరంతరాయంగా దహిస్తున్న అగ్నికీలలు- మహోపద్రవకారకం అనడంలో మరోమాట లేదు. ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మెక్రాన్‌ చెప్పినట్లుగా- ‘మన ఇంటికి నిప్పంటుకుంది’!

అడవులను నరికేస్తే తప్పదు వినాశనం

శివుడి కంఠంలో గరళాన్ని దాచుకొన్నట్లు బొగ్గుపులుసు వాయువును శోషించుకునే అడవులు, మనిషి అత్యాశకు బలయ్యేటప్పుడు అదే గరళాన్ని విరజిమ్ముతాయి. ఇప్పటి కార్చిచ్చు రగులుకోకముందే నరికివేత పాలబడిన అమెజాన్‌ ఏటా 50 కోట్ల మెట్రిక్‌ టన్నుల బొగ్గుపులుసు వాయువుల్ని వెదజల్లుతోందని ‘వరల్డ్‌ వైల్డ్‌లైఫ్‌ ఫండ్‌’ వెల్లడించింది. క్యాలిఫోర్నియా, ఆస్ట్రేలియాల్లోని అడవుల మాదిరిగా అంత తేలిగ్గా నిప్పంటుకోని అమెజాన్‌ వర్షారణ్యాలు ఇప్పుడింతగా తీవ్రాందోళన కలిగించే స్థాయిలో పరశురామ ప్రీతి అయిపోవడానికి బ్రెజిల్‌ అధ్యక్షుడు బోల్సొనారో హ్రస్వదృష్టి విధానాలే కారణం. బ్రెజిల్‌ పరిధిలో 60 శాతం ఉన్న అమెజాన్‌ అడవుల్ని నేలమట్టం చేసి దేశాభివృద్ధికి పునాదులు వెయ్యాలన్న బోల్సొనారో పెడసరం యావత్‌ మానవాళికీ వినాశకరం కానుందన్నది నిస్సందేహం!

స్వార్థపూరిత చర్యలే కారణం!

తమ కార్యకలాపాల వల్ల ఇతర దేశాల పర్యావరణానికి భంగం వాటిల్లకుండా శ్రద్ధ వహించాలన్నది- 1992 జూన్‌లో రియో డి జెనీరోలో జరిగిన ధరిత్రీ సదస్సు తీర్మానాల్లో అత్యంత కీలకమైనది. నాడు ఆ సదస్సుకు ఆతిథ్యం ఇచ్చిన బ్రెజిలే నేడు తన పరిధిలోని అమెజాన్‌ అరణ్యాలు తన ఇష్టారాజ్యానికి లోబడి ఉంటాయంటూ ఒంటెత్తు పోకడలు పోవడం ప్రపంచ పర్యావరణానికే పెను సవాలు రువ్వుతోంది. పర్యావరణ సమతుల్యత సాధనకు, దేశాభివృద్ధి లక్ష్యాలకూ ముడిపెట్టాలన్న ధరిత్రీ సదస్సు మౌలిక లక్ష్యాన్ని ఆచరణాత్మకం చెయ్యడంలో విఫలమైన బ్రెజిల్‌- సతత హరితారణ్యాల్ని బుగ్గిపాలు చేసి సోయాబీన్‌, ఆయిల్‌పామ్‌ వంటి వాణిజ్యపంటల సాగు, గనుల తవ్వకాలు, కలప విక్రయాలతో ఆర్థికంగా బలపడాలని భావిస్తోంది. శ్వేతసౌధంలో కాలిడిన వెంటనే ప్యారిస్‌ ఒప్పందానికి కట్టుబడేదిలేదన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తెంపరితనాన్ని పుణికిపుచ్చుకొన్న బోల్సొనారో- పర్యావరణ పరిరక్షణ నిధులకు భారీగా కోతపెట్టి, అమెజాన్‌ పరిరక్షణే లక్ష్యంగా ఉన్న ఇరవయ్యేళ్ల విధానానికి సొడ్డుకొట్టి- అడవిని కాల్చుకుతినే వర్గాలకు అక్షరాలా కొమ్ముకాశారు. పర్యావరణ నిబంధనల ఉల్లం‘ఘనుడి’గా గతంలో జరిమానాలు చెల్లించిన బోల్సొనారో- దేశార్థిక ప్రగతికి రక్షిత అటవీ ప్రాంతాలే ప్రధాన అవరోధమంటూ, వాటిని వాణిజ్య ప్రాతిపదికన అభివృద్ధి చేసే మార్గాలపై దృష్టి సారిస్తానని ఎన్నికల ప్రచారంలోనే చెప్పారు. మొన్న జనవరిలో బోల్సొనారో అధికారానికి వచ్చాక 1330 చదరపు మైళ్ల అమెజాన్‌ అరణ్యం అంతర్థానమైపోయింది. ఇప్పుడీ విచ్చలవిడి కార్చిచ్చులను అదుపు చెయ్యడానికి ప్రపంచ దేశాల ఒత్తిడికి తలొగ్గి 40 వేల సైనిక సిబ్బందిని పురమాయించినా- అమెజాన్‌ అరణ్యఘోష ఆగేదెప్పటికి?

ఏటికేడు తగ్గుతున్న వృక్షచ్ఛాయ

గత సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా మూడు కోట్ల 90 లక్షల ఎకరాల వృక్షచ్ఛాయ కనుమరుగైందని, అందులో బెల్జియం దేశమంత పరిమాణంలో అంటే 89 లక్షల ఎకరాల వర్షారణ్యాలు నామరూపాల్లేకుండా పోయాయని మేరీల్యాండ్‌ విశ్వవిద్యాలయ పరిశోధన వెల్లడించింది. 1990-2000 సంవత్సరాల మధ్య సగటున ఏటా మూడు కోట్ల 95 లక్షల ఎకరాల అడవులు నేలమట్టం కాగా, ఆ మరుసటి దశాబ్దిలో అది మూడుకోట్ల 21 లక్షల ఎకరాల నరికివేతకు దిగివచ్చిందని అంతర్జాతీయ అధ్యయనాలు ఎలుగెత్తుతున్నాయి. భూమ్మీద మనిషికి ఒకటి చొప్పున 780 కోట్ల చెట్లు పెంచాలని ఐక్యరాజ్య సమితి చేసిన నిర్దేశానికి ఏ గతి పట్టిందోగాని, అమెజాన్‌ గుండెల్లోనే ఆరని చిచ్చు రగిలించే దుర్మార్గాలు యథేచ్ఛగా సాగిపోతున్నాయి.

అణ్వాయుధం కంటే ప్రమాదం...

జీవనం కోసం పేదలు చెట్లను కొట్టేయకుండా కాచుకోవడానికి 1997లోనే కోస్టారికా జాతీయస్థాయిలో ‘పర్యావరణ సేవలకు ప్రతిఫలం’ పేరిట కొంత సొమ్ము చెల్లించే విధానాన్ని తొలిసారిగా ప్రవేశపెట్టింది. దరిమిలా మెక్సికో, చైనా, బొలీవియా వంటివి అదే బాట పట్టినా, అటవీ విధ్వంసం దూకుడు తగ్గిందేకాని పూర్తిగా ఆగలేదు. అమెజాన్‌ పరిరక్షణ నిధికి జర్మనీ, నార్వే 130 కోట్ల డాలర్లు అందిస్తున్నా- దానివల్ల ఏం ఒరుగుతుందని ప్రశ్నించే బోల్సొనారోవంటి నేతలు నేడు దాపురించారు. సతత హరితారణ్యాల విధ్వంసం తాలూకు ముప్పు అణుబాంబుల వంటి సామూహిక జనహనన ఆయుధ ప్రయోగాలకు ఏ మాత్రం తీసిపోనిది. అణ్వాయుధాలపట్ల ప్రపంచ దేశాలు ఎంత ఆందోళనతో స్పందిస్తాయో బ్రెజిల్‌ చేస్తున్న పర్యావరణ వినాశాన్నీ అంతే తీవ్రంగా పరిగణించాలి. అమెజాన్‌ కార్చిచ్చును ఆర్పడానికే కాదు, పర్యావరణానికి చేటుతెచ్చే దుర్మార్గాలకు ఎవరు తెగబడ్డా ప్రపంచ దేశాలన్నీ ఉమ్మడి బాధ్యతతో ఒక్కతాటిపైకి రావాలి. ఎందుకంటే- మనకున్నది ఒక్కటే భూమి!

ఇదీ చూడండి:అమెజాన్​ కార్చిచ్చు ఆర్పేందుకు ముమ్మర చర్యలు

Last Updated : Sep 28, 2019, 12:10 PM IST

ABOUT THE AUTHOR

...view details