ప్రపంచ దేశాలను కరోనా వైరస్ వణికిస్తోంది. ప్రజల ప్రాణాల్ని హరిస్తున్న ఈ మహమ్మారిని అంతం చేసేందుకు బ్రహ్మాస్త్రంగా భావిస్తోన్న వ్యాక్సిన్‌వైపే అందరూ కోటి ఆశలతో చూస్తున్నారు. ఇప్పటికే పలు దేశాలకు చెందిన ఫార్మా దిగ్గజ కంపెనీలు దాదాపు 150 వ్యాక్సిన్లను అభివృద్ధి చేయడంలో తలమునకలై ఉన్నాయి. ఆ టీకాలు వివిధ దశల్లో ఉన్నాయి. మరో 12 రోజుల్లో తమ టీకా అందుబాటులోకి వస్తుందని రష్యా ప్రకటించగా.. 25 టీకాలు మానవ ప్రయోగ దశలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొవిడ్ మహమ్మారిని తుదముట్టించే రోజులు త్వరలోనే రాబోతున్నాయని ప్రజల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ప్రపంచ దిగ్గజ ఫార్మా కంపెనీలు అభివృద్ధి చేస్తున్న ఈ టీకాలు ఏ దశలో ఉన్నాయనే అంశంపై ప్రత్యేక కథనం మీకోసం...
కరోనా వ్యాక్సిన్ల రేసులో ప్రపంచ దేశాల పరుగు.! ఆగస్టు 10నాటికి రష్యా వ్యాక్సిన్ సిద్ధం!
ప్రపంచంలో ఏవైపు చూసినా.. ఎవరినోట విన్నా కరోనా.. కరోనా.. కరోనా. ఈ వైరస్ ప్రపంచ జీవన గమనాన్నే మార్చేయడం సహా ప్రజల్ని భయం గుప్పెట్లో వణికిస్తోంది. దీన్ని కట్టడి చేయడమే లక్ష్యంగా వ్యాక్సిన్‌లు తయారు చేసే రేసులో ప్రపంచ దేశాలు పరుగులు పెడుతున్నాయి. పోటీ పడి మరీ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసేందుకు శాస్త్రవేత్తలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆగస్టు 10న తాము అభివృద్ధి చేస్తున్న కరోనా వ్యాక్సిన్‌కు ఆమోద ముద్ర వేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్టు రష్యా ప్రకటించింది. ఇదే జరిగితే ప్రపంచంలో అధికారికంగా వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెచ్చిన తొలి దేశంగా రష్యా అవతరించనుంది. మాస్కో గమేలెయ ఇన్‌స్టిట్యూట్, రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌ఫండ్ అభివృద్ధి చేసిన ఈ టీకాను మరో 1600మందికి ఇవ్వాలని నిర్ణయించారు. ఈ వ్యాక్సిన్‌కు ఆగస్టులో షరతులతో కూడిన రిజిస్ట్రేషన్ చేయాలని రష్యా భావిస్తోంది. సెప్టెంబర్‌లో టీకా ఉత్పత్తిని ప్రారంభించనుంది.
ఆగస్టు 10నాటికి రష్యా వ్యాక్సిన్ సిద్ధం! ప్రయోగదశలో 25 వ్యాక్సిన్లు
ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 150 టీకాలు అభివృద్ధి దశలో ఉన్నాయి. రష్యా వ్యాక్సిన్‌తో పాటు మరో 25 వ్యాక్సిన్‌లు మానవ ప్రయోగ దశలో ఉన్నాయి. అభివృద్ధి దశలో వ్యాక్సిన్‌లు ఉన్న దేశాల జాబితాలో భారత్, బ్రిటన్, చైనా, అమెరికా, ఇజ్రాయెల్ ఉన్నాయి. మోడెర్నా ఆస్ట్రాజెనికా, బయోఎన్‌టెక్, నోవ్యాక్స్, కాంచినో బయోలాజిక్స్, ఇనోవియో ఫార్మాస్యూటికల్స్‌కు చెందిన వ్యాక్సిన్లు మానవ ప్రయోగ దశలో ముందున్నాయి. ఈ వ్యాక్సిన్లు వైరస్‌కు వ్యతిరేకంగా ప్రభావవంతంగా పనిచేస్తాయన్న అంశంపై ఇంకా స్పష్టత లేకపోయినప్పటికీ వ్యాక్సిన్ విజయవంతమైతే తగినంతగా ఉత్పత్తి ఉండేందుకు బ్రిటన్ సహా పలు దేశాలు పెట్టుబడులు పెడుతున్నాయి.
ప్రయోగదశలో 25 వ్యాక్సిన్లు మూడో దశ ట్రయల్స్ లక్ష్యమదే..: మోడెర్నా
కొవిడ్ వ్యాక్సిన్ తయారీలో ప్రధానంగా వినిపిస్తోన్న మోడెర్నా సంస్థ టీకా కోతుల్లో వైరస్‌ను విజయవంతంగా నిలువరిస్తోందని ఆ సంస్థ ప్రకటించింది. మరోవైపు, ఈ వ్యాక్సిన్‌కు మూడో దశ క్లినికల్ ట్రయల్స్ కొనసాగుతున్న నేపథ్యంలో అమెరికా ప్రభుత్వం నుంచి 472 మిలియన్ డాలర్ల అదనపు సాయం అందింది. మూడో దశ ప్రయోగాల్లో భాగంగా 30వేల మంది వాలంటీర్లకు టీకా ఇస్తున్నారు. వ్యాక్సిన్ భద్రతతో పాటు కరోనాను ఏ స్థాయిలో అడ్డుకుంటుందనే అంశాలను నిర్ధారించడమే ఈ మూడో దశ ప్రయోగాల లక్ష్యమని మోడెర్నా తెలిపింది.
మూడో దశ ట్రయల్స్ లక్ష్యమదే..: మోడెర్నా దేశంలో ముందంజలో భారత్ బయోటెక్
మరోవైపు, భారత్ బయోటెక్, జైడస్ కాడిలా హెల్త్ కేర్ సంస్థలు భారత్‌లో కరోనా వ్యాక్సిన్ తయారీ ప్రయత్నాల్లో ముందున్నాయి. మొదటి, రెండో దశ ప్రయోగాలకు వీటికి ప్రభుత్వం నుంచి అనుమతి లభించింది. ఈ మేరకు పలు ప్రైవేటు ప్రయోగశాలలు, ప్రభుత్వ ఆసుపత్రులతో ఈ సంస్థలు ప్రయోగాలు జరిపేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాయి. దేశ వ్యాప్తంగా భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) ఎంపికచేసిన 12 ప్రదేశాల్లో భారత్ బయోటెక్ రూపొందిస్తున్న కొవాగ్జిన్ టీకాను ప్రాథమిక దశలో పరీక్షిస్తున్నారు. ఇందులో రోహ్‌తక్‌కు చెందిన పోస్టు గ్రాడ్యుయేషన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో ప్రోత్సాహకర ఫలితాలు వచ్చినట్టు తేలింది. అలాగే, గతవారం దిల్లీలోని ఎయిమ్స్‌లో భారత్ బయోటెక్ రూపొందిస్తున్న కొవాగ్జిన్ టీకాను 30 ఏళ్ల వ్యక్తికి అందించారు. కొవాగ్జిన్ ఫేజ్ 1, ఫేజ్ 2 దశలకు ఒక సంవత్సరం 3 నెలల సమయం పడుతుందని క్లినికల్ ట్రయల్స్ రిజిస్ట్రీ ఆఫ్ ఇండియా వెల్లడించింది
దేశంలో ముందంజలో భారత్ బయోటెక్ ఆక్స్‌ఫర్డ్ టీకా 2,3 దశల క్లినికల్ ట్రయల్స్‌కు దరఖాస్తు
ఆక్స్‌ఫర్డ్ అభివృద్ధి చేస్తున్న కరోనా టీకాకు భారత్‌లో రెండో, మూడో దశ క్లినికల్ ట్రయల్స్ జరిపేందుకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతిని సీరమ్ ఇన్‌స్టిట్యూట్‌ఆఫ్ ఇండియా కోరింది. బ్రిటిష్ స్వీడిస్ బహుళజాతి ఫార్మా సంస్థ అస్ట్రాజెనికా, ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం సంయుక్తంగా ఏజడ్డీ1222 పేరిట ఈ టీకాను అభివృద్ధి చేస్తున్నాయి. భారత్‌లో కొవిషీల్డ్ పేరుతో సీరమ్ ఇన్‌స్టిట్యూట్‌ఆఫ్ ఇండియా విడుదల చేయనుంది. మరో దేశీయ ఫార్మా సంస్థ జైడస్ కాడిలా కూడా మానవులపై పరీక్షలు నిర్వహిస్తోంది. ఈ ప్లాస్మిడ్ డీఎన్‌ఏ వ్యాక్సిన్ రోగ నిరోధక శక్తిని పెంచుతుందని జైడస్ తెలిపింది.
ఆక్స్‌ఫర్డ్ టీకా 2,3 దశల క్లినికల్ ట్రయల్స్‌కు దరఖాస్తు చైనాలో వేగంగా వ్యాక్సిన్ ట్రయల్స్
మరోవైపు, తమ టీకాలు రోగనిరోధక శక్తిని పెంచడం సహా.. సురక్షితమని తేలాయంటూ జర్మన్ బయోటెక్ సంస్థ బయోఎన్‌టెక్, అమెరికా ఫార్మా సంస్థ ఫైజర్ ప్రకటించాయి. కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా అధికస్థాయి టీ-సెల్స్‌ను ప్రదర్శిస్తున్నట్టు తెలిపాయి.ఈ ఏడాది అక్టోబర్ నాటికి తమ వ్యాక్సిన్‌కు అన్నిరకాల అనుమతులువచ్చే అవకాశం ఉన్నట్టు ఫైజర్ సంస్థ ప్రకటించింది. ఈ ఏడాది చివరి నాటికి తమ వ్యాక్సిన్ అందుబాటులోకి తెస్తామని వెల్లడించింది. మరోవైపు, వైరస్ పుట్టిన చైనాలోనూ వ్యాక్సిన్ ట్రయల్స్ వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే జంతువులపై చేసిన ప్రయోగాలు సత్ఫలితాలు ఇస్తున్నట్టు తెలుస్తోంది. వుహాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బయోలాజికల్స్ ప్రొడక్ట్స్ సహా బీజింగ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బయోలాజికల్ ప్రొడక్ట్స్ కలిసి తయారుచేసిన వ్యాక్సిన్‌ను 2 వేల మందిపై పరీక్షించినట్టు వార్తలు వచ్చాయి. అయితే, ఇప్పటివరకు ఓ ప్రామాణికమైన వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసినట్టు చైనా ప్రకటించలేదు.
చైనాలో వేగంగా వ్యాక్సిన్ ట్రయల్స్ పూర్తిస్థాయి వ్యాక్సిన్ 2021లోనే.!
సాధారణంగా వ్యాక్సిన్ తయారీ ప్రక్రియకు కొన్ని సంవత్సరాలు పడుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే, కొవిడ్ వ్యాప్తి దృష్ట్యా నెలల వ్యవధిలోనే వ్యాక్సిన్ తయారు చేయాలని పరిశోధకులు భావిస్తున్నారు. అయితే ఇలా చేయడం దీర్ఘకాలానికి మంచిది కాదని పలువురు శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. కరోనా వ్యాప్తి, మార్కెట్‌లో డిమాండ్ నేపథ్యంలో ఫార్మా సంస్థలు వ్యాక్సిన్ అభివృద్ధిపై ఎన్ని ప్రకటనలు చేసినా పూర్తిస్థాయి వ్యాక్సిన్ మాత్రం 2021 మధ్యలో అందుబాటులోకి వస్తుందని నిపుణులు అంటున్నారు.
పూర్తిస్థాయి వ్యాక్సిన్ 2021లోనే.! ఇదీ చదవండి:వ్యాక్సిన్ తయారీలో భారత్‌దే కీలక పాత్ర: ఫౌచీ