కశ్మీర్ అంశంపై భారత్- పాకిస్థాన్ మధ్య జరుగుతోన్న పరిణామాలను అమెరికా నిశితంగా పరిశీలిస్తోందని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఈ వివాదంపై సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు ట్రంప్.
దావోస్‌లో జరుగుతోన్న ప్రపంచ ఆర్థిక సదస్సులో భాగంగా పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌తో ట్రంప్ భేటీ అయ్యారు. కశ్మీర్ అంశం సహా పలు విషయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇమ్రాన్‌తో భేటీలో ట్రంప్ నోట మళ్లీ 'కశ్మీర్' పాట
"మేము వాణిజ్యం సహా పలు విషయాలపై చర్చిస్తున్నాం. అయితే వాణిజ్యం ఇందులో ప్రధానాంశం. కశ్మీర్ అంశం, పాకిస్థాన్- భారత్ మధ్య పరిణామాలపైనా చర్చించాం. సాయం చేయాల్సివస్తే చేస్తాం. ఇరు దేశాల మధ్య పరిణామాలను చాలా దగ్గరగా పరిశీలిస్తున్నాం." - డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు
భారత పర్యటన సందర్భంగా పాకిస్థాన్‌కు వెళ్తారా అని అడిగిన ప్రశ్నకు ట్రంప్ బదులిచ్చారు. ఇప్పుడు భేటీ అయ్యాం.. కనుక కలవకపోవచ్చు అని సమాధానమిచ్చారు ట్రంప్. అయితే ఇమ్రాన్ తనకు మంచి స్నేహితుడని.. మళ్లీ కలవడానికి సంతోషిస్తానన్నారు అమెరికా అధ్యక్షుడు.