తెలంగాణ

telangana

ETV Bharat / international

ట్రంప్ వివాదాస్పద ఆదేశాలను వెనక్కి తీసుకున్న బైడెన్ - జాతీయ ఎమర్జెన్సీ డిక్లరేషన్

అమెరికా 46వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జో బైడెన్‌ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పటివరకు ట్రంప్ జారీచేసిన అనేక వివాదాస్పద ఆదేశాలను బైడెన్‌ వెనక్కితీసుకున్నారు. పారిస్ వాతావరణ ఒప్పందంలో చేరడం.. కొన్ని ముస్లిం దేశాల పౌరులు రాకుండా విధించిన నిషేధం ఉపసంహరణ వంటి.. 15 కార్యానిర్వాహక ఆదేశాలపై జో బైడెన్ సంతకం చేశారు. భారతీయ ఐటీ నిపుణులకు ఊరటనిచ్చేలా.. గ్రీన్‌ కార్డుల జారీకి దేశాలవారీగా ఉన్న పరిమితిని ఎత్తివేసే ఉత్తర్వులపై బైడెన్‌ సంతకం చేశారు.

After taking office President of the United States, Jo biden has withdrawn several controversial orders issued by Trump
బైడెన్​ బాధ్యతలు చేపట్టిన తొలిగంటలోనే వివాదాస్పద చట్టాల రద్దు

By

Published : Jan 21, 2021, 8:14 AM IST

అమెరికా పాలనా పగ్గాలు స్వీకరించిన జో బైడెన్‌ 15 కార్యనిర్వాహక ఆదేశాలపై సంతకాలు చేశారు. వాతావరణ మార్పులు, సమానత్వం, ఆర్థిక ఉద్దీపనలు సహా మెమోరాండాలు, సూచనలు, లేఖలపై సంతకం చేశారు.

కరోనాపై పోరు..డబ్ల్యూహెచ్​ఓలో ప్రవేశం..

ట్రంప్‌ తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలు ఉపసంహరించడం సహా అమెరికాను ప్రగతి పథంలో ముందుకు తీసుకెళ్లే దిశగా చర్యలు చేపట్టారు. అమెరికా కొవిడ్ కోరల్లో విలవిలలాడుతున్న వేళ వైరస్ వ్యాప్తిని అరికట్టేలా తొలిచర్యలు చేపట్టారు. మాస్క్ చాలెంజ్‌ విసిరిన బైడెన్‌.. వందరోజులు మాస్క్‌ ధరించాలని అమెరికన్లను కోరారు. ఫెడరల్ ఉద్యోగులు, కాంట్రాక్టర్లు మాస్క్‌ తప్పనిసరిగా ధరించాలని, భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలనే కార్యనిర్వాహక ఆదేశంపై సంతకం చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అమెరికా వైదొలిగే ప్రక్రియను నిలిపివేసే ఆదేశంపైనా బైడెన్ సంతకం చేశారు. కొవిడ్‌ రెస్పాన్స్‌ కో-ఆర్డినేటర్‌ను ఏర్పాటు చేసేందుకు వీలుగా మరో కార్యనిర్వాహక ఆదేశంపై సంతకం చేశారు. ఈ కో-ఆర్డినేటర్‌ నేరుగా అధ్యక్షుడికే నివేదికలు సమర్పించడం సహా కొవిడ్ నియంత్రణకు ప్రభుత్వంలోని అన్ని శాఖలతో సమన్వయం చేసే బాధ్యత చేపట్టనున్నారు.

పర్యావరణహిత నిర్ణయం..

పారిస్ వాతావరణ ఒప్పందంలో మళ్లీ చేరేలా కార్యనిర్వాహక ఆదేశంపై బైడెన్‌ సంతకం చేశారు. ఈ ఆదేశాన్ని వెంటనే ఐరాసలో సమర్పిస్తారు. తర్వాత 30రోజులకు అమెరికా అధికారికంగా మళ్లీ పారిస్ ఒప్పందంలో చేరుతుంది. పర్యావరణ సంక్షోభాన్ని అధిగమించే చర్యల్లో భాగంగా కేంద్రప్రభుత్వ ఉద్యోగాలను సృష్టించే కార్యానిర్వాహక ఆదేశంపైనా బైడెన్ సంతకంచేశారు.

కూలిన విభజన గోడలు..

మెక్సికో సరిహద్దుల వెంబడి గోడ కట్టేందుకు నిధులు మళ్లించేలా తెచ్చిన జాతీయ ఎమర్జెన్సీ డిక్లరేషన్‌ను తక్షణమే రద్దయ్యే ఆదేశానికీ బైడెన్‌ ఆమోదం తెలిపారు. అలాగే.. ఫెడరల్ కార్యక్రమాలు సంస్థల్లో జాతి వివక్షకు తావులేకుండా అందరికీ సమానంగా అవకాశాలు కల్పించే కార్యనిర్వాహక ఆదేశంపై కొత్త అధ్యక్షుడు సంతకం చేశారు. అమెరికాలోనే ఉంటూ పౌరులుగా గుర్తింపు లేనివారిని జనాభా లెక్కల నుంచి మినహాయించాలన్న ట్రంప్‌ ఆదేశాలను రద్దుచేసే ఆదేశానికీ బైడెన్‌ ఆమోదం తెలిపారు. అమెరికా కార్యానిర్వాహక విభాగంలో నియమించిన ప్రతిఒక్కరూ స్వీయప్రయోజనాల కోసం కాకుండా దేశంకోసం పనిచేస్తామనే నైతిక ప్రమాణపత్రంపై సంతకంచేసేలా మరో ఆదేశం జారీచేశారు.

ముస్లిం దేశాలకు ఊరట..

కొన్ని ముస్లిం, ఆఫ్రికాదేశాల పౌరులు అమెరికాలో ప్రవేశించకుండా విధించిన నిషేధాన్ని ఉపసహరించే ఆదేశంపైనా సంతకం చేశారు. బాధిత దేశాలకు వెంటనే వీసా ప్రక్రియ ప్రారంభించాలని ఆదేశించనున్నారు. ఇక చిన్న పిల్లలుగా అమెరికా వచ్చిన వారిని బలవంతంగా తిరిగి వారి దేశాలకు పంపకుండా తాత్కాలిక ఊరట కల్పించే ఆదేశంపైనా బైడెన్ సంతకం చేశారు.

గ్రీన్​కార్డ్ ఇక​ సులువు..

జాతి నిర్మాణంలో ఎన్నోఏళ్లుగా పాలుపంచుకుంటున్న వారందరికీ శాశ్వత పౌరసత్వం ఇచ్చేలా చట్టం చేయాలని అమెరికా కాంగ్రెస్‌ను కోరారు. ఈ మేరకు ఇమ్మిగ్రేషన్‌ బిల్లును కాంగ్రెస్‌కు పంపనున్నారు. అర్హత ఉంటే అక్రమ వలసదారులు గ్రీన్‌కార్డుకోసం దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పిస్తారు. గ్రీన్‌కార్డు పొందిన మూడేళ్ల తర్వాత వారికి అమెరికా శాశ్వత పౌరసత్వానికి దరఖాస్తు చేసుకునే అవకాశం ఇస్తారు. అర్హతలు లేనివారికి ఐదేళ్లు మధ్యంతర హోదా ఇస్తారు. వారుకూడా గ్రీన్ కార్డులు పొందిన మూడేళ్ల తర్వాత శాశ్వత పౌరసత్వానికి దరఖాస్తు చేసుకునేలా వెసులుబాటు కల్పించారు. అదే బిల్లులో గ్రీన్‌కార్డుల జారీపై దేశాలవారీ ఉన్న పరిమితిని ఉపసంహరించే ఆదేశంపై జో బైడెన్‌ సంతకం చేశారు. తద్వారా వేలాదిమంది భారతీయ ఐటీ నిపుణులకు ఊరట కలగనుంది.

ఇదీ చదవండి:100 రోజుల్లో బైడెన్​ ఆ లక్ష్యాలను చేరుకుంటారా?

ABOUT THE AUTHOR

...view details