అమెరికా క్యాపిటల్ భవనం వద్ద అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు హింసాత్మక చర్యలకు దిగిన క్రమంలో.. ఆయన సామాజిక మాధ్యమాల ఖాతాలపై చర్యలు చేపట్టాయి యాజమాన్య సంస్థలు. ఇప్పటికే ట్రంప్ పోస్టు చేసిన వీడియో సందేశాన్ని తొలగించి 24 గంటల పాటు ఖాతాను నిలిపివేసిన ఫేస్బుక్ యాజమాన్యం మరో కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి 20న జో బైడెన్ ప్రమాణ స్వీకారం వరకు ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లోని ట్రంప్ ఖాతాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బెర్గ్.
" ప్రస్తుత సమయంలో అధ్యక్షుడు ట్రంప్ తమ ప్లాట్‌ఫాంలను వినియోగించుకునేందుకు అనుమతించటం చాలా ప్రమాదకరం. కనీసం వచ్చే రెండు వారాల పాటు ట్రంప్ ఖాతాలు నిలిపివేయనున్నాం. గత 24 గంటల్లో జరిగిన దిగ్భ్రాంతికర సంఘటనలు.. జో బైడెన్‌కు శాంతియుతంగా, చట్టబద్ధంగా అధికార మార్పిడిని అణగదొక్కాలని ట్రంప్ భావిస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. క్యాపిటల్ భవనంపై తమ మద్దతుదారుల చర్యలను ఖండించాల్సింది పోయి.. వారికి మద్దతుగా నిలిచేందుకు సామాజిక మాధ్యమ ప్లాట్‌ఫాంలను వినియోగిస్తున్నారు. హింసను మరింత రెచ్చగొట్టేలా ఉన్న కారణంగా గురువారం ట్రంప్ పోస్టులను తొలగించాం."
- మార్క్ జుకర్‌బెర్గ్, ఫేస్బుక్ వ్యవస్థాపకుడు.