తాలిబన్ల చెరలో(Afghanistan Taliban) చిక్కుకొని అల్లాడుతున్న అఫ్గాన్ ప్రజలకు ఆకలి దప్పుల(Afghanistan Food and Hunger) రూపంలో మరో ముప్పు పొంచి ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అఫ్గాన్‌లో ఉన్న ఆహార నిల్వలు ఈ నెలకు మాత్రమే సరిపోతాయని ఐక్యరాజ్యసమితికి చెందిన సీనియర్ అధికారి రమిజ్ అలాక్బరోవ్ తెలిపారు. ఇప్పటికే దేశంలోని మూడోవంతు మంది ప్రజలు ఆహార సమస్య(Afghanistan Hunger Crisis) ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 3.8కోట్ల మంది రోజూ ఆహారం తీసుకుంటున్నారో లేదో తెలియని పరిస్థితి నెలకొందని చెప్పారు.
అఫ్గాన్‌లో అరకొరగా ఉన్న ఆహార నిల్వలు కూడా అడుగంటితే.. పరిస్థితి మరింత దారుణంగా తయారయ్యే ప్రమాదముందని రమిజ్ అలాక్బరోవ్ హెచ్చరించారు. ప్రస్తుతం సంక్షోభం ఎదుర్కొంటున్న వేలాది మంది అఫ్గాన్‌లకు ఆహారాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. అయితే రానున్న రోజుల్లో ఆహార సమస్య ఎదుర్కొంటున్న వారి సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉండటం వల్ల.. ఆహార సరఫరాకు దాదాపు 200 మిలియన్ డాలర్లు ఖర్చు అవుతాయని అంచనా వేసింది. ఆకలి బాధలు చిన్నారుల్లోనే అధికంగా ఉందని ఐరాస అధికారి పేర్కొన్నారు.
"సగానికి పైగా చిన్నారులు ఈ రోజు రాత్రి ఆహారం తీసుకుంటారో లేదో తెలియదు. క్షేత్రస్థాయిలో మేం ఎదుర్కొంటున్న వాస్తవ పరిస్థితి ఇది. ఈ చిన్నారులకు ఆహారం అందించే పరిస్థితి లేదు. ఔషధాల కొరత ఉంది. బడ్జెట్ పరిమితుల కారణంగా.. సోషల్ సెక్టార్ కార్మికులు, టీచర్లకు వేతనాలు చెల్లించలేని పరిస్థితి ఉంది."
-రమిజ్ అలాక్బరోవ్, ఐరాస అధికారి
గుటెరస్ ఆవేదన