భారీ సముద్ర జీవి 'మనటీ' శరీరంపై ట్రంప్ పేరును చెక్కిన నిందితులపై భారీ రివార్డు ప్రకటించారు హాలీవుడ్ నటుడు, ప్రముఖ రెజ్లర్ డేవ్ బటిస్టా. నిందితుడి గురించి సమాచారం అందిస్తే 20 వేల డాలర్లు ఇస్తానని తెలిపారు. దీంతో పాటు బోనస్ సైతం ఉంటుందని చెప్పారు.
"ఈ దారుణానికి పాల్పడ్డవారిపై ఇప్పటివరకు ఎలాంటి రివార్డులు లేకపోతే.. నేను 20 వేల డాలర్లు ఇస్తాను. దీనికి బోనస్‌గా మరిన్ని రివార్డులు ఉంటాయని మాటిస్తున్నాను."
-బటిస్టా ట్వీట్
అయితే, సెంటర్ ఫర్ బయోలాజికల్ డైవర్సిటీ ఇదివరకే నిందితుడిపై నజరానా ప్రకటించింది. సమాచారం ఇస్తే 5 వేల డాలర్లు ఇస్తామని స్పష్టం చేసింది. ఏ కారణంగానైనా ఈ జీవులను హింసించకూడదని సంస్థ ఫ్లోరిడా డైరెక్టర్ జాక్లిన్ లోపేజ్ పేర్కొన్నారు. వీటికి హాని కలిగించడం నేరమని స్పష్టం చేశారు.
సముద్ర జీవిపై ట్రంప్ పేరు
జనవరి 10న ఫ్లోరిడాలోని హొమొససా నదిలో ఈ జీవిని గుర్తించారు అధికారులు. దాని శరీరంపై ట్రంప్ అనే ఆంగ్ల అక్షరాలను చెక్కినట్లు తెలిపారు. జంతువు శరీరంపై పెరిగిన నాచు మీద పేరును చెక్కడం వల్ల దానికి తీవ్ర గాయాలు కాలేదని వెల్లడించారు.
ఇదీ చదవండి:ట్రాక్టర్ ర్యాలీపై సోమవారం సుప్రీం విచారణ