'హైడ్రాక్సీ క్లోరోక్విన్' మాత్రలను మానవాళికి అందించిన మహానుభవలు ఆచార్య 'ప్రఫుల్‌చంద్ర రే'. ఇక హ్యాండ్ శానిటైజర్లను అందించిన పితామహుడు 'సెమ్మెల్‌వీస్'.
హైడ్రాక్సీ క్లోరోక్విన్ వెలుగు రేఖ!
మలేరియాను మట్టుబెట్టే విశేష ఔషధంగా గుర్తింపు పొందిన హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రలు... ప్రస్తుతం కరోనాకు కళ్లెం వేసేందుకూ ఉపయోగపడుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంపే స్వయంగా మన ప్రధాని మోదీకి ఫోన్ చేసి.. హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రలు పంపాలని కోరారంటే వాటి ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. భారతదేశానికి ఈ ఘనత దక్కుతోందంటే దీని వెనుక ఓ మహానుభావుడు ఉన్నారు. ఆయనే భారత రసాయన శాస్త్ర పితామహుడు ఆచార్య ప్రఫుల్‌చంద్ర. ప్రస్తుతం అమెరికా సహా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలకు మనం హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రలను పంపించే సామర్థ్యం సాధించామంటే అప్పట్లో 'ప్రఫుల్ చంద్ర రే' సాగించిన అపూర్వ కృషే కారణం.
ఎవరీ రే?
1861 ఆగస్టు 2న అప్పటి బంగాల్ ప్రెసిడెన్సీలోని రరూలీ-కటిపార గ్రామం (ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో ఉంది)లో జన్మించారు ప్రఫుల్ చంద్ర రే. ఇంగ్లాండ్‌లోని ప్రఖ్యాత ఎడిన్‌బరో యూనివర్సిటీ నుంచి 1887లో డీఎస్‌సీ డిగ్రీ పొందారు. ఆ తర్వాత ప్రెసిడెన్సీ కళాశాలలో 1892 వరకూ రసాయన శాస్త్రాన్ని బోధించారు. రూ.700 మూలధనంతో 'బెంగాల్ కెమికల్ వర్క్స్' సంస్థను ప్రారంభించారు. ప్రజోపయోగ ఔషధాలెన్నింటినో ఉత్పత్తి చేశారు. 1901లో రూ.2 లక్షల పెట్టుబడితో బెంగాల్ కెమికల్స్ అండ్ ఫార్మాస్యూటికల్ వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ను ఏర్పాటుచేశారు. ఈ సంస్థ నుంచి మలేరియాను నివారించే హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రలు పెద్దఎత్తున ఉత్పత్తి అయ్యేవి. కొంతకాలం కిందట వీటి ఉత్పత్తిని నిలిపేశారు. సంస్థ నుంచి ఒక్క రూపాయి కూడా వేతనం తీసుకోకుండా రసాయనశాస్త్రంలో తనకున్న అపార అనుభవాన్ని రంగరించి.. ప్రజలను అనారోగ్య ఇక్కట్ల నుంచి బయట పడేసే ఔషధాలను ఉత్పత్తి చేశారు ప్రఫుల్‌చంద్ర రే. 'హిందూ రసాయన శాస్త్ర చరిత్ర' అనే గొప్ప గ్రంథాన్ని రాశారీయన. ఈయన కలం నుంచి వెలువడిన వ్యాసాలు అనేక జర్నళ్లలో ప్రచురితమై గుర్తింపును తెచ్చాయి. 1944 జూన్ 16న ఆయన మరణించారు.