ఆఫ్రికన్ అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ మృతికి నిరసనగా అమెరికా వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆందోళనకారులు వినూత్నంగా నిరసనలు తెలుపుతున్నారు. కొంతమంది చేతులు వెనక్కి పెట్టి రోడ్డు మీద పడుకొని, మరికొందరు ప్లకార్డులు ప్రదర్శించి నిరసనలు తెలిపారు. బాణసంచా కాల్చి వినూత్నంగా ఆందోళనలు చేశారు. 338 మంది నిరసనకారుల్ని పోలీసులు అరెస్టు చేశారు. ఓ ఆందోళనకారుడ్ని నిర్దాక్షిణ్యంగా ఈడ్చుకుంటూ వెళ్లారు పోలీసులు.
దశాబ్దాల్లో ఎన్నడూలేని విధంగా అమెరికా వ్యాప్తంగా 140కి పైగా నగరాల్లో నిరసనలు జరుగుతుండగా... అలర్లు హింసాత్మకంగా మారిన 40 నగరాల్లో కర్ఫ్యూ అమలవుతోంది.
'సైన్యాన్ని దించుతా'
శ్వేతసౌధం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొనడం వల్ల సోమవారం బంకర్లోకి వెళ్లిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్... రాష్ట్రాల గవర్నర్లపై మండిపడ్డారు. ఘర్షణలు తెరదించేందుకు నేషనల్‌గార్డ్స్‌ను బరిలోకి దింపకుంటే, ప్రెసిడెంట్ లా ఆర్డర్‌ను విధించి సాయుధ సైనికుల్ని దించుతానని హెచ్చరించారు ట్రంప్.
"జార్జ్ ఫ్లాయిడ్ కుటుంబానికి న్యాయం చేసేందుకు మా ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉంది. దేశంలో జరుగుతున్న అల్లర్లకు పేదవర్గాల్లోని శాంతికాముకులు బాధితులుగా మారుతున్నారు. అమెరికా అధ్యక్షుడిగా వారిని సురక్షితంగా ఉంచేందుకు నేను పోరాడతాను. లింకన్ మెమోరియల్, రెండో ప్రపంచ యుద్ధ మెమోరియళ్లను ధ్వంసం చేశారు. ఇవి శాంతియుత నిరసనలు కాదు. స్థానిక ప్రభుత్వాలు ఈ చర్యలు తీసుకోవడానికి నిరాకరిస్తే, ప్రజల ప్రాణాలు, ఆస్తిని రక్షించేందుకు అమెరికా సైన్యాన్ని మోహరించి సమస్యను త్వరగా పరిష్కరిస్తాను."
-డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు