అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. నార్త్ డకోటాలోని 8వ జిల్లాకు జరిగిన ఎన్నికలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డేవిడ్ డీన్ అండాల్ విజయం సాధించారు. అయితే సరిగ్గా నెలక్రితం డేవిడ్ కరోనాతో మృతి చెందడం దురదృష్టకరం. 55ఏళ్ల డేవిడ్ అక్టోబరు మొదటివారంలో కొవిడ్ సోకి ఆసుపత్రిలో చేరారు. పరిస్థితి విషమించి.. అక్టోబరు 6న ప్రాణాలు కోల్పోయారు.
అయితే డేవిడ్ మరణించినప్పటికీ ఆయన పేరును బ్యాలెట్ నుంచి తొలగించలేదు. నార్త్ డకోటాలో సెప్టెంబరు 18 నుంచే ఎర్లీ మెయిల్ ఇన్ ఓటింగ్ ప్రారంభమైంది. దీంతో డేవిడ్ పేరును తొలగించేందుకు వీలు పడలేదని అధికారులు తెలిపారు. అయితే తాజాగా వెలువడిన ఫలితాల్లో ఓటర్లు డేవిడ్‌కే పట్టంకట్టడం విశేషం. ఆయనతో పాటు మరో రిపబ్లికన్ అభ్యర్థి డేవిడ్ నెహ్రింగ్ కూడా ఇక్కడ విజయం సాధించారు.
మరోవైపు అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై ఇంకా ఉత్కంఠ వీడట్లేదు. ఇప్పటివరకు వెల్లడైన ఫలితాల ప్రకారం.. డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ 264 ఎలక్టోరల్ ఓట్లతో మ్యాజిక్ ఫిగర్(270)కి అత్యంత చేరువలో ఉన్నారు. ఇంకా ఫలితాలు వెలువడని రాష్ట్రాల్లో ట్రంప్, బైడెన్ మధ్య గట్టి పోటీ కొనసాగుతోంది.