అమెరికాలోని కాలిఫోర్నియా, పశ్చిమ నెవాడాల్లో బుధవారం భారీ ఈదురుగాలులతో తుపాను బీభత్సం సృష్టించింది. అనేక ప్రాంతాల్లో రోడ్లన్నీ బురదమయమయ్యాయి. వేగంగా వీస్తున్న గాలుల తాకిడితో పలుచోట్ల భారీ వృక్షాలు, విద్యుత్తు స్తంభాలు నేలకొరిగాయి. ఫలితంగా.. శాన్ఫ్రాన్సిస్కో, శాక్రామెంటో ప్రాంతాలు అంధకారంలోకి వెళ్లాయి. కొన్ని గంటలపాటు వేలాది మంది విద్యుత్తు లేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
పసిఫిక్ మహాసముద్రంలో మొదలైన ఈ తుపాను.. గత రాత్రి శాన్ఫ్రాన్సిస్కో వద్ద తీరం దాటింది. తుపాను ధాటికి తాహో సరస్సు ఆల్పైన్ మెడోస్ వద్ద గంటకు 125 మైళ్లు(201 కిలోమీటర్లు) వేగంతో గాలులు వీచాయి.