అమెరికా ఎన్నికల్లో అవకతవకలపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. చాలా మంది అధికారులు, నిపుణులు ఎలాంటి అక్రమాలు జరగలేదని అంగీకరించినా ట్రంప్ పట్టువీడటం లేదు. అయితే, ట్రంప్ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితాల్లో మార్పులు అసాధ్యమని విశ్లేషకులు చెబుతున్నారు.
కానీ, ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు పదేపదే చేయటం వల్ల ఎన్నికల వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లుతుందన్నారు. ట్రంప్ మద్దతుదారుల దృష్టిలో బైడెన్ అక్రమంగా ఎన్నికయ్యారనే భావన పెరుగుతుందన్నారు.
అయినప్పటికీ, జో బైడెన్ గెలుపునకు కారణమైన కీలక రాష్ట్రాల్లో ఫలితాల ధ్రువీకరణను అడ్డుకోవటం లేదా ఆలస్యం చేసేందుకు ట్రంప్‌తో పాటు ఆయన మద్దతుదారులు ప్రయత్నిస్తున్నారు. బ్యాలెట్ల నిర్వహణ, తమ పరిశీలకులను అనుమతించలేదని ఫిర్యాదు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకపోవడం వల్ల కోర్టుల్లో వీటిని రుజువు చేయటంలో విఫలమవుతున్నారు.
ప్రస్తుతం ఆరు రాష్ట్రాల్లో ఎన్నికలపై రిపబ్లికన్లు ఫిర్యాదులు చేశారు. ఆయా రాష్ట్రాల్లో కేసుల స్థితిగతులు ఇలా..
1.అరిజోనా..
రాష్ట్రంలో అత్యంత జనాభా కలిగిన మరికోపా కౌంటీలో ఫలితాలను నిలిపేయాలని రిపబ్లికన్లు కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ కొనసాగుతోంది. అయితే, ఆడిట్లో ఎలాంటి తేడాలు లేవని అధికారులు చెబుతున్నారు.
ఫలితాల ధ్రువీకరణను ఆలస్యం చేయాలని వేసిన మరో పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది.
2.జార్జియా..
రాష్ట్రంలో పోస్టల్ బ్యాలెట్ల నిర్వహణ ప్రక్రియను అక్రమంగా మార్చారని కన్జర్వేటివ్ అటార్నీ లిన్ ఉడ్ ఆరోపించారు. పోస్టల్ బ్యాలెట్లపై సంతకాలకు సంబంధించి ఎలాంటి ప్రమాణాలు లేవన్నారు. ఫలితాల ధ్రువీకరణ నిలిపేయాలని డిమాండ్ చేశారు. ఉడ్ ఆరోపణలు మూర్ఖమైనవని జార్జియా ఉన్నతాధికారి ఒకరు విమర్శించారు.
ఉడ్ వ్యాజ్యంపై గురువారం విచారణ జరగనుంది. ఈ రాష్ట్రంలో చేపట్టిన రీకౌంటింగ్ ఫలితాలు కూడా గురువారమే విడుదల కానున్నాయి.