రాజులు పోయినా.. వారి విలాసవంతమైన జీవనాన్ని అక్కడక్కడా మ్యూజియాల్లో, వారు నిర్మించిన కట్టడాల్లో చూస్తునే ఉంటాం. కానీ ఈ మ్యూజియంలో ఉన్న విలాసవంతమైన వస్తువులు మాత్రం రాజులవి కావు. ఒకప్పుడు మెక్సికో దేశాన్ని గడగడలాడించిన కొంతమంది డాన్‌లు వాడిన ఖరీదైన వస్తువులు. మెక్సికో ప్రభుత్వం వీటి కోసం ఓ మ్యూజియం ఏర్పాటు చేసి ప్రదర్శనకు పెట్టింది. అయితే ఇందులో కేవలం ప్రభుత్వ గూఢచారులకు, శిక్షణలో ఉన్న సైనికులకు మాత్రమే ప్రవేశం పరిమితం చేసింది. డాన్‌ల గురించి అధ్యయనం చేయడానికి ఈ విలాసవంతమైన వస్తువులను వారికోసం పాఠ్యాంశంగా చేసింది.
వజ్రాలతో పొదిగిన తుపాకులు
బంగారం, వజ్రాలు, రత్నాలతో నగిశీలు దిద్దిన తుపాకులు అందంగా ఈ మ్యూజియంలో మనకు దర్శనమిస్తాయి. అప్పట్లో వీటిని డాన్‌లు వారి హోదాకు తగ్గట్టు ఉపయోగించే వారు. వాటిలో కొన్నింటిపై సంక్షిప్తమైన అక్షరాలు కనిపిస్తాయి. అవి డాన్ల పేర్లను, హోదాను తెలిపే సంక్షిప్తమైన అక్షరాలు. ఏసీఎఫ్ అంటే 'లార్డ్ ఆఫ్ ది స్కైస్' అని అర్థం. దీనిని ఒకప్పుడు అమాడో కారిల్లో ఫ్యుఎంటెస్ అనే డాన్ ఉపయోగించే వారు. అలాగే వజ్రాలతో పొదిగిన కోల్ట్ 45 తుపాకిని జోక్విన్ ఎల్ చాపో అనే చీకటి సామ్రాజ్యాధినేత వాడేవారు. 2016 అరెస్టు సమయంలో చాపో నుంచి పోలీసులు ఈ తుపాకిని స్వాధీనం చేసుకున్నారు.