61 ఏళ్ల వయస్సులో పాపకు జన్మనివ్వడం ద్వారా వార్తల్లో నిలిచారు సిసిలీ బామ్మ. స్వలింగ సంపర్కుడైన తన కుమారుడి కోసం బిడ్డను కనాలని ముదిమి వయస్సులో తన మనవరాలికే జన్మనిచ్చి తల్లయ్యారు. కన్న ప్రేమకు సాటి ఏదీ లేదని నిరూపించారు.
అమెరికా నెబ్రాస్కాలోని ఒమాహ పట్టణవాసి 'సిసిలీ'. ఈ 61 ఏళ్ల బామ్మ సరోగసీ పద్ధతిలో తన మనవరాలికి జన్మనిచ్చారు. ఆ పాపకు ముద్దుగా 'ఉమా లూయీస్ డౌగర్తీ ఎలెడ్జ్' గా నామకరణం చేశారు.
కొడుకు మాథ్యూ ఎలెడ్జ్, అల్లుడు ఇలియట్ డౌగర్తీ దంపతుల అభిలాషను అర్థం చేసుకున్న సిసిలీ వారికి ఓ బంగారు పాపను కని కానుకగా ఇచ్చారు.
"నేను చేయవలసిందల్లా నా జీవితంలో ఒకటిన్నర సంవత్సరాలు త్యాగం చేయడం. అన్యోన్య దంపతులైన నా కొడుకు-అల్లుడి కోసం ఈ పని చేయాలని నిర్ణయించుకున్నాను."-సిసిలీ, మనవరాలికి జన్మనిచ్చిన బామ్మ
సోదరుని కోసం సిసిలీ కుమార్తె లియా యెరిబే అండం దానం చేశారు. మాథ్యూ నుంచి శుక్రకణాలు స్వీకరించి వైద్యులు పిండాన్ని అభివృద్ధి చేశారు.