ఓ పోలీస్ కర్కశత్వానికి.. ఆఫ్రో-అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ బలై పది రోజులు దాటిపోయింది. ఇప్పటికీ ఆ నల్లజాతీయుని మృతికి నిరసనగా ఆందోళనలు ఉద్ధృతంగా సాగుతున్నాయి. కొన్ని చోట్ల శాంతియుతంగా, మరికొన్ని చోట్ల హింసాత్మకంగా మారాయి నిరసనలు. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా 8:46 సంఖ్యతో ముడిపెడుతూ నినాదాలు, శాంతియుత నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. అసలు 8:46కు, ఫ్లాయిడ్ మృతికి సంబంధమేంటి?
- 8:46- జార్జి ఫ్లాయిడ్ మెడపై పోలీసు మోకాలుతో అదిమిపట్టి ఊపిరాడకుండా చేసిన సమయం.
- ఫ్లాయిడ్ వయసూ 46 సంవత్సరాలు.
ఈ విషయాలను విచారణ సందర్భంగా న్యాయవాదులు తెలిపారు. ఆ కచ్చితమైన సంఖ్యపై వారు స్పష్టంగా చెప్పనప్పటికీ ఇదే ఇప్పుడు అమెరికా ఉద్యమ నినాదంగా మారింది. జనాల్లో బాగా ప్రాచుర్యం పొందింది.
ఫ్లాయిడ్ మృతికి సంఘీభావంగా...
బోస్టన్, టకోమా, వాషింగ్టన్లో ఎంతో మంది నల్లజాతీయులు ఫ్లాయిడ్ తరహాలో.. చేతులు వెనక్కిపెట్టి మరణించినట్లు పడుకున్నారు. 8 నిమిషాల 46 సెకన్లపాటు మొరపెట్టుకుంటూ ఫ్లాయిడ్ నరకయాతన పడిన క్షణాలను స్మరించుకుంటున్నారు.
వయాకామ్‌సీబీఎస్, గూగుల్ ఇతర కంపెనీలు.. ఫ్లాయిడ్ మృతికి సంఘీభావంగా ఆ సంఖ్యను ప్రస్తావించాయి.
వాషింగ్టన్లో డెమొక్రటిక్ సెనెటర్లు కొందరు నిల్చొని, మరికొందరు మోకరిల్లి 8 నిమిషాల 46 సెకన్ల పాటు మౌనం పాటించారు.
వాస్తవంలోకి...
మినియాపొలిస్‌లో ఫ్లాయిడ్ స్మారకార్థం.. నిరసనకారులు 8 నిమిషాల 46 సెకన్ల పాటు ''జార్జ్ ఏం చేస్తున్నాడో చూడండి. అక్కడ పడిపోయి తన ప్రాణాల కోసం వేడుకుంటున్నాడు'' అంటూ ఆయన అనుభవాలను ప్రపంచానికి చూపెట్టే ప్రయత్నం చేశారు.