Megaflash Lightning: వర్షాల సమయంలో మెరుపులు, పిడుగులు సాధారణమే! అయితే ప్రపంచంలోనే అతి పెద్ద మెరుపును అమెరికాలో గుర్తించినట్లు ఐరాసకు చెందిన ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంఓ) తాజాగా వెల్లడించింది. 2020 ఏప్రిల్‌లో అమెరికా దక్షిణ ప్రాంతంలో దాదాపు 770 కిలోమీటర్ల మేర వ్యాపించిన ఈ మెరుపు సరికొత్త రికార్డును నెలకొల్పినట్లు పేర్కొంది. మిసిసిపీ, లూసియానా, టెక్సాస్‌ల మీదుగా ఇది విస్తరించినట్లు తెలిపింది. 2018 అక్టోబరులో దక్షిణ బ్రెజిల్‌లో నమోదైన మునుపటి రికార్డు కంటే ఈ మెరుపు 60 కిలోమీటర్ల మేర అధికంగా నమోదైనట్లు పేర్కొంది. మెరుపులకు సంబంధించి మరో ప్రపంచ రికార్డునూ డబ్ల్యూఎంఓ నిపుణుల కమిటీ నమోదు చేసింది. 2020 జూన్‌లో ఉరుగ్వే, ఉత్తర అర్జెంటీనాపై ఏర్పడిన ఓ మెరుపు ఏకంగా 17.1 సెకన్లపాటు నిలిచినట్లు తెలిపింది. ఈ ప్రాంతంలోనే 2019 మార్చిలో నమోదైన మునుపటి రికార్డు కంటే ఇది 0.37 సెకన్లు ఎక్కువ.
'మెరుపు ఘటనలకు సంబంధించిన అసాధారణ రికార్డులివి' అని డబ్ల్యూఎం ప్రతినిధి రాండాల్ సెర్వెనీ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రకృతి శక్తి సామర్థ్యాలకు ఇవి కొలమానం అని అన్నారు. మెరుపుల పొడవు, వ్యవధిని గుర్తించడానికి ఉపయోగించే సాంకేతికత ఇటీవలి కాలంలో చాలా మెరుగుపడినట్లు తెలిపారు. శాటిలైట్ లైట్నింగ్ ఇమేజరీ టెక్నాలజీ తదితర సాంకేతికతలు వచ్చినట్లు ఆయన వెల్లడించారు. మెరుపులను గుర్తించే సాంకేతికత మెరుగుపడుతున్నందున ఇంకా ఎక్కువ తీవ్రత గల వాటిని గుర్తించే అవకాశం ఉందని సెర్వేని చెప్పారు.