మందుమాకూ లేని మహమ్మారికి విరుగుడు కనిపెట్టేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోంది అమెరికా. ఇందుకోసం డజన్ల కొద్దీ ప్రయోగాలు చేపట్టింది. యూఎస్‌లో 72 క్రియాశీల పరీక్షలు జరుగుతున్నాయని, కరోనాను నియంత్రించే వ్యాక్సిన్లను రూపొందించేందుకు శాస్త్రవేత్తలు విపరీతంగా కృషి చేస్తున్నారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.
కొవిడ్‌ను పూర్తిగా నివారించే చికిత్సా విధానాలను రూపొందిస్తున్నామని ట్రంప్ స్పష్టం చేశారు.
"ఈ సంక్షోభం మొదలైన రోజు నుంచే అమెరికా పరిశోధనలు ప్రారంభించింది. సంయుక్త అమెరికా దేశాల్లో ప్రస్తుతం 72 క్రియాశీల పరీక్షలు జరుగుతున్నాయి. మరో 211 చికిత్సా విధానాలను ప్రయోగించేందుకు ప్రణాళికలు చేస్తున్నాం.. వ్యాక్సిన్ తయారీలో పురోగతి కనిపిస్తోంది. ఈ విషయంలో మంచి పరిణామాలు జరుగుతున్నాయి. మీరు చూస్తూ ఉండండి.. మరి కొన్ని వారాల్లోనే, మనం (అమెరికా) కరోనాకు విరుగుడు గురించి మాట్లాడతాం. ఆ రోజులు ఎంతో దూరంలో లేవు."