అమెరికాలో తుపాకులు మరోసారి గర్జించాయి. న్యూజెర్సీలో జరిగిన కాల్పుల్లో ఓ పోలీసు అధికారి సహా ఐదుగురు మరణించారు. జెర్సీ నగరంలో గంటలపాటు భారీగా కాల్పులు జరిగినట్లు నగర పోలీస్ అధికారి మిషేల్ కెల్లీ వెల్లడించారు. మరణించినవారిలో ఇద్దరు అనుమానిత నిందితులు ఉన్నట్లు తెలిపారు.
న్యూజెర్సీలో కాల్పుల కలకలం... ఆరుగురు మృతి - న్యూజెర్సీలో కాల్పుల కలకలం- ఆరుగురి మృతి
అమెరికా న్యూజెర్సీలో కాల్పులు కలకలం సృష్టించాయి. న్యూజెర్సీ నగరంలో జరిగిన ఈ కాల్పుల్లో ఆరుగురు మరణించారు. మృతుల్లో ఓ పోలీస్ అధికారి సహా ఇద్దరు అనుమానిత నిందితులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఇది ఉగ్రవాద చర్య కాదని చెప్పిన అధికారులు... ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
జెర్సీ నగరంలోని శ్మశానం ప్రాంతంలో ప్రారంభమైన కాల్పులు కొషర్ సూపర్‌మార్కెట్ వరకు కొనసాగినట్లు మిషేల్ వివరించారు. ఈ ప్రాంతంలో ఐదు మృతదేహాలు గుర్తించినట్లు తెలిపారు. అయితే ఈ కాల్పులు ఉగ్రవాదులు చేసిన చర్య కాదని, దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు సిటీ పబ్లిక్ సేఫ్టీ డైరెక్టర్ జేమ్స్ షియా తెలిపారు. కాల్పులకు గల కారణాలు వెల్లడించనప్పటికీ... ఎవరైనా ఆగంతుకులను అడ్డుకోవడంలో భాగంగానే పోలీసు అధికారి మరణించి ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు.
ఈ ఘటనలో గాయపడ్డ ఇద్దరు పోలీసులను ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం వారిని డిశ్చార్జి చేసినట్లు అధికారులు చెప్పారు.కాల్పులతో చుట్టుపక్కల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. సమీపంలోని పాఠశాలను ముందుజాగ్రత్తగా అధికారులు మూసివేశారు. ఘటనా స్థలంలో భారీగా పోలీసులను మోహరించారు.